సాధారణంగా.. 10 అంతస్తుల భవనంపైన నుంచి కిందికి చూస్తేనే కళ్లు తిరిగినట్లు అవుతుంది. ఆచితూచి నడవకపోతే ఇక అంతే! అనుకుని జాగ్రత్తపడుతుంటాం. కానీ ఓ మహిళ ఏకంగా.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన టవర్ మీద ధైర్యంగా నిలబడి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ వీడియో చూస్తే కచ్చితంగా గుండె జారిపోతుంది!
క్రియేటివ్ ఐడియా..!
ఇటీవలే.. బ్రిటన్ ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలను కొంత సడలించింది. కొన్ని దేశాలతో జాబితాను రూపొందించి.. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వారికి క్వారంటైన్ ఉండదని పేర్కొంది. ఆ జాబితాలో యూఏఈ కూడా ఉంది. ఆ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థ ఎమిరేట్స్ తనదైన శైలిలో ఓ యాడ్‌ను రూపొందించింది. ఈ 33సెకన్ల యాడ్‌లో.. ఓ మహిళ ఎమిరేట్స్ యూనిఫాం వేసుకుని, 'యూకే జాబితాలో యూఏఈ ఉండటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆకాశం అంచున ఉన్నట్టు అనిపిస్తోంది' అన్న సందేశం వచ్చే విధంగా ప్లకార్డులు పట్టుకుని బుర్జ్ ఖలీఫాపైన నిలబడింది. దాదాపు క్లోజ్అప్లోనే వీడియో ఉండగా.. చివరి కొద్ది సెకన్లు మాత్రమే.. ఒక్కసారిగా కెమెరాను లాంగ్ షాట్లోకి తీసుకెళ్లేసరికి.. ఒక్కసారి గుండె జారిపోయిన ఫీలింగ్ చూసినవారికి కలుగుతోంది.