ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించాలని ఊవిళ్లూరుతున్న చైనా.. అందుకు అనుగుణంగా ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. శత్రురాడార్ల కళ్లుగప్పే సాంకేతిక పరిజ్ఞానంతో (స్టెల్త్) కూడిన అధునాతన ఆయుధాలను సిద్ధం చేసుకుంటోంది. అంతేకాకుండా ప్రస్తుతం తయారు చేసుకున్న ఆయుధాలకు మెరుగులను సైతం దిద్దుతోంది.
ఇటీవల చెంగ్డూ ఎయిర్‌బేస్‌లో కనిపించిన పీఎల్ఏ ఎయిర్‌ఫోర్స్ జే20 ఫైటర్ జెట్ అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా ఫైటర్జెట్లలో ఒక్క సీటే ఉంటుండగా.. జే20 కాక్‌పిట్‌లో మాత్రం రెండు సీట్లు ఉండటం ఆశ్చర్యం కలిగించింది. ఇది ట్రైనర్ జెట్ అన్న అనుమానాలను జే20 డిజైనర్ యాంగ్ వెయి సెప్టెంబర్‌లోనే కొట్టిపారేశారు. దీంతో కో-పైలట్ స్థానం ఉపయోగంపై ఓ స్పష్టత వచ్చినట్లైంది.
ప్రధాన పైలట్ విమానం నడపడంపై ప్రధానంగా దృష్టిసారిస్తే... పేలోడ్లు, ఆయుధ సంపత్తిని కో-పైలట్ నిర్వహించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆధునిక యుద్ధాలను పూర్తిగా మార్చేసే సత్తా ఈ ట్విన్ పైలట్ జెట్లకు ఉందని అంటున్నారు. అమెరికా చేతిలో ఉన్న ఎఫ్35 జాయింట్ స్ట్రైక్ ఫైటర్, ఎఫ్22ఏ రాప్టార్ల తర్వాత.. ప్రపంచంలో మూడో స్టెల్త్ ఫైటర్ జెట్ ఇదే కావడం విశేషం. ఇలాంటివి చైనా ఎయిర్‌ఫోర్స్ వద్ద 150 వరకు ఉన్నాయి. మరిన్ని విమానాలనూ తయారు చేస్తోంది డ్రాగన్. భారీ స్థాయిలో వీటి ఉత్పత్తి ప్రారంభించిందని తెలుస్తోంది.
ఫైటర్ జెట్
మరోవైపు, ఎఫ్‌సీ31 పేరుతో మరో స్టెల్త్ ఫైటర్ జెట్‌ను అభివృద్ధి చేస్తోంది చైనా. ఇద్దరు పైలట్లు కూర్చునే సామర్థ్యంతో దీన్ని తయారు చేస్తోంది. మధ్యస్థ పరిమాణంలో ఉండే ఈ విమానాలను.. నావికాదళం కోసం వినియోగించనుందని తెలుస్తోంది. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న విమాన వాహక నౌకలపై దీన్ని ఉపయోగించనుంది.
స్ట్రాటజిక్ బాంబర్
ఎఫ్‌సీ31 స్ట్రాటజిక్ స్టెల్త్ బాంబర్ విమానాలను సైతం చైనా అభివృద్ధి చేస్తోంది. హెచ్20గా పిలుస్తున్న వీటిని.. అణ్వాయుధాలను మోసుకెళ్లేలా సిద్ధం చేస్తోంది. దీని పరిధి 8500 కిలోమీటర్లు కాగా.. 10 మెట్రిక్ టన్నుల బరువును మోసుకెళ్లగలదు. సంప్రదాయ ఆయుధాలను సైతం ప్రయోగించే సామర్థ్యం దీనికి ఉంది.