చుట్టూ విరిగిపడిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, ఇళ్లలో అలముకున్న అంధకారం, బయటకు వెళదామంటే కనుచూపు మేర వరద నీరు. అదే సమయంలో... కొన్ని చోట్ల భారీగా కురుస్తున్న మంచు, వణికించే చలిగాలులు. ఇదీ ఆస్ట్రేలియా ఆగ్నేయ ప్రాంతంలోని విక్టోరియా, న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రాల్లో ప్రజల పరిస్ధితి.
విక్టోరియా రాష్ట్రంలో బుధవారం 20 సెంటీమీటర్ల వర్షం కురవగా, గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. దీంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. రెండు లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరద నీరు, కొండ చరియలు విరిగిపడటం వల్ల రహదారులను అధికారులు మూసివేశారు. విక్టోరియాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
విక్టోరియాలో 2008 తర్వాత ఈ స్థాయిలో వరదలు రావడం ఇదే తొలిసారి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.