ఏడుగురు చిన్నారులు, ముగ్గురు శిశువులు.. మొత్తం 62 మంది. వీరందరి కలలు, ఆశలు.. ఇండోనేసియా విమాన ప్రమాద రూపంలో జలసమాధి అయ్యాయి. ఈ ఘటనతో ఆ దేశ ప్రమాదాల చరిత్రలో మరో చీకటి అధ్యాయం చేరినట్లయింది. మరి ఎందుకని అక్కడే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి? దీనిపై విశ్లేషకులు ఏమంటున్నారు?
అసలేం జరిగింది?
అదృశ్యమైన ఇండోనేసియా విమానం జావా సముద్రంలో కూలిపోయినట్లు తేలింది. సిబ్బంది సహా 62 మంది ఈ ఘటనలో జల సమాధి అయినట్లు ఆదివారం నిర్ధరణ అయింది. శనివారం జకార్తా నుంచి పోటియాన్కు బయల్దేరి, నిమిషాల వ్యవధిలోనే రాడార్ తెరపై నుంచి ఆచూకీ గల్లంతైన శ్రీ విజయ విమానయాన సంస్థ బోయింగ్ ఆచూకీని నౌకాదళం కనిపెట్టగలిగింది. 75 అడుగుల లోతులో విమాన శకలాలు ఉన్నట్లు తేల్చింది. ప్రయాణికుల్లో ఎవరూ ప్రాణాలతో బయటపడ్డట్టు సమాచారం లేదు.
ఇండోనేసియాలోనే ఎందుకు ఎక్కువగా?
ఇందుకు ఆర్థిక, సామాజిక, భౌగోళిక కారణాలున్నాయి. ఇండోనేసియా విమానయాన సేవలు ఊపందుకుంటున్న కొత్తలో... 1990 చివర్లో సుహ్రతో విమానం కుప్పుకూలింది. ఆ ఘటన తర్వాత విమానయాన వ్యవస్థపై కాస్త పర్యవేక్షణ పెంచింది అక్కడి ప్రభుత్వం. కానీ, ఆ తర్వాత కూడా అనేక విమాన ప్రమాదాలు ఆ దేశంలో జరుగుతూనే ఉన్నాయి.
తక్కువ ధరలో విమాన సేవలు అందించే లయన్ ఎయిర్ సంస్థకు చెందిన విమానం 2018లో కూలిపోయింది. ఈ ఘటనలో సిబ్బంది 189 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ద్వీప దేశంలో ఇప్పటికీ.. సమర్థమైన రవాణా వ్యవస్థ లేదనడానికి ఈ ఘటనలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
ఇప్పటి వరకు ఎన్ని ప్రమాదాలు జరిగాయి?
గగనతల భద్రతా వ్యవస్థ(ఏఎస్ఎన్) సమాచారం ప్రకారం..1945 నుంచి ఇప్పటివరకు 104 పౌర విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. 1,300 మంది ప్రాణాలు పోయాయి. ఈ కారణాలతో ఆసియాలోనే విమాన ప్రయాణానికి అత్యంత ప్రమాకరమైన స్థలమనే అపకీర్తిని మూటగట్టుకుంది ఇండోనేసియా.
వరుస ప్రమాదాలు చోటుచేసుకున్న కారణంగా.. ఈ దేశానికి చెందిన అన్ని విమానాలపై అమెరికా 2007 నుంచి 2016 వరకు నిషేధం విధించింది. ఇదే తరహాలో యూరోపియన్ యూనియన్ కూడా 2007లో నిషేధం విధించింది. ఈ ఆంక్షలు 2018 వరకు అమలులో ఉన్నాయి.
ఆ తర్వాత ఏమైంది?
ఈ ప్రమాదాల తర్వాత ఇండోనేసియా ప్రభుత్వం తమ విమానయాన రంగంపై పర్యవేక్షణను పెంచిందని ఎయిర్‌లైన్ రేటింగ్స్.కామ్ సంపాదకుడు జెఫ్రీ థామస్ చెప్పారు. తరచూ తనిఖీలు, విమానాల్లో సౌకర్యాల పెంపు, సుశిక్షితులైన పైలట్లను విధుల్లో నియమించడం వంటి చర్యలను ఆ దేశం చేపట్టిందని తెలిపారు.