చంద్రుడికన్నా చేరువలో ఉండే, అంగారకుడికన్నా తక్కువగానే అర్థమైన... మరో ప్రపంచం స్థాయిలో జీవరాశిని కలిగి ఉన్న సముద్ర గర్భంపై మనిషి దృష్టి పడింది. ఖనిజాల వేట పేరిట భూగర్భాన్ని అడ్డగోలుగా తవ్వి పారేసిన ఆధునిక మానవుడు, ఇప్పుడు సముద్ర గర్భాన్నీ ఛిద్రం చేసేందుకు నడుంకట్టాడు. సముద్ర అంతర్భాగంలో ఉండే విలువైన ఖనిజాలు పలు దేశాల్ని, కంపెనీల్ని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. వాటిని తవ్వేందుకు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రయత్నాలే సాగుతున్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, రష్యా, చైనా, భారత్‌లతోపాటు, చిన్నచిన్న దీవులూ ఆ రేసులో ఉన్నాయి. సముద్ర గర్భం అద్వితీయమైన ఆవరణ వ్యవస్థకు ఆలవాలం. సముద్ర గర్భంలో ‘పాలిమెటాలిక్ నాడ్యూల్స్’గా పిలిచే నల్లగా, ఉబ్బెత్తుగా, ఆలుగడ్డ ఆకృతుల్లో ఉండే చిన్నచిన్న నిర్మాణాల్లో రాగి, నికెల్, కోబాల్ట్, మాంగనీస్, ఇనుముతోపాటు అరుదైన పదార్థాలు నిల్వ ఉంటాయి. సముద్రంలో 12 వేల నుంచి 18 వేల అడుగుల లోతులో పది లక్షల చదరపు మైళ్ల మైదానం వంటి ప్రాంతంలో భారీ స్థాయిలో పాలిమెటాలిక్ నాడ్యూల్స్ ఉన్నట్లు గుర్తించారు.ప్రకృతి సిద్ధమైన ఈ పదార్థాలు ఆధునిక ఉపకరణాలైన స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, పేస్‌మేకర్లు, హైబ్రిడ్ కార్లు, సోలార్ ప్యానెళ్ల తయారీలో కీలకంగా ఉపయోగపడతాయి.
ఖనిజాల కోసం పోటీ...
పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సౌకర్యాలు ఇలాంటి వనరులకు గిరాకీని పెంచుతున్నాయి. ఈ క్రమంలో పలు కంపెనీలు సముద్ర అంతర్భాగం నుంచి లోహాలు, ఖనిజాలను సేకరించేందుకు బారులు తీరుతున్నాయి. లాఖీడ్ మార్టిన్ అనుబంధ సంస్థ యూకే సీబెడ్ రిసోర్సెస్ వంటి కంపెనీలు ఉత్సుకత కనబరుస్తుండగా, కెనడాకు చెందిన డీప్‌గ్రీన్ వంటి అంకుర పరిశ్రమలూ అంతే ఉత్సాహంగా ఉన్నాయి. ఐక్యరాజ్యసమితికి చెందిన ‘అంతర్జాతీయ సముద్రగర్భ ప్రాధికార సంస్థ(ఐఎస్‌ఏ)’ ఇప్పటికే 29 లైసెన్సులు మంజూరు చేసింది. పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల్లో 13 లక్షల చ.కి.మీ. వైశాల్యం పరిధిలో లైసెన్సులు ఇచ్చారు. ‘సముద్ర గర్భ గనుల తవ్వకం సదస్సు-2020’ వచ్చే మే నెలలో లండన్‌లో జరుగనుంది. అందులో గనుల తవ్వకందారులు, నిపుణులు, శాస్త్రవేత్తలు, అనుబంధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ రంగంలో మార్కెట్ అవకాశాలు, కష్టనష్టాల్ని చర్చించనున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే, మరోవైపు- ఇప్పటిదాకా కేవలం 0.0001 శాతం మాత్రమే అన్వేషణకు గురైన సముద్ర గర్భానికి, భారీ తవ్వకాలతో హాని తప్పదని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘సముద్రయాన్’లో భారత్
చంద్రయాన్ తరహాలోనే ‘సముద్రయాన్’ ప్రాజెక్టును చేపట్టాలని భారత్ తలపోస్తోంది. 2021-22 నాటికి దీన్ని సాకారం చేయాలని లక్ష్యిస్తోంది. సముద్ర గర్భంలో అరుదైన ఖనిజాల తవ్వకాలకు సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా సముద్రయాన్‌ను చేపట్టనున్నారు. ఇందులో చెన్నైలోని జాతీయ సముద్ర సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం(ఎన్‌ఐఓటీ) ఆధ్వర్యంలో ముగ్గురు నిపుణులు నీటిలోపల ప్రయాణించే ప్రత్యేక వాహనంలో ఆరు వేల మీటర్ల లోతుదాకా వెళ్లి పరిశోధనలు చేపడతారు. ఆ వాహనం సముద్రం అడుగున దాదాపు 72 గంటలపాటు ప్రయాణం చేయగలదు. వేల కోట్ల రూపాయలతో చేపడుతున్న ‘డీప్ సీ మిషన్ (డీఎస్‌ఎం)’లో భాగంగా దాదాపు రూ.200 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టు నెలకొల్పుతున్నారు. ఇది విజయవంతమైతే, సముద్ర గర్భంలోని ఖనిజాల తవ్వకాల విషయంలో భారత్ కూడా ఇతర అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిచే అవకాశం ఉంది.
భారత్ పరిస్థితి...
భారత్‌కు కేటాయించిన ప్రాంతం, పరిధిలో పాలిమెటాలిక్ నాడ్యూల్స్‌లో 38కోట్ల టన్నుల వనరులు ఉన్నట్లు అంచనా. ఇందులో 47లక్షల టన్నుల నికెల్, 42.9లక్షల టన్నుల రాగి, 5.5లక్షల టన్నుల కోబాల్ట్, 9.25కోట్ల టన్నుల మాంగనీస్ ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే పదేళ్లలో భారత ప్రభుత్వం 100కోట్ల డాలర్లకన్నా ఎక్కువ మొత్తమే సముద్ర గర్భ సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి, పరీక్షల కోసం ఖర్చు పెట్టనుంది. నీటి అంతర్భాగంలో ప్రయాణించే యంత్రాలు, మనిషి నడిపించే జలాంతర్గాములు వంటి వాటిపై నిధులు వెచ్చించనున్నట్లు కేంద్ర భూవిజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ చెబుతోంది. భారత్‌కు మధ్య హిందూ మహాసముద్ర బేసిన్‌లో 75 వేల చ.కి.మీ. ప్రాంతాన్ని ఐఎస్‌ఏ కేటాయించింది. ఈ ప్రాంతంలో పాలిమెటాలిక్ నాడ్యూల్స్‌పై పరిశోధనలు జరుపుకోవచ్చు. ‘కొంచెం ముందో, వెనకో మనం సముద్ర వనరులపై ఆధారపడాల్సిందే, అంతకుమించిన మార్గం లేదు, భవిష్యత్తు మానవజాతి అవసరాలకు సముద్రమే ఆశాజ్యోతి’ అని ఎన్‌ఐఓటీలో సముద్ర గర్భ తవ్వకాల ప్రాజెక్టు నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
రెండు దశాబ్దాల నుంచే...
సముద్ర గర్భంలో తవ్వకాలు చేపట్టాలన్న భారత ఆకాంక్షలు రెండు దశాబ్దాల నుంచే రెక్కలు తొడుక్కున్నాయి. అప్పటినుంచే వివిధ సర్వేలు, పర్యావరణ ప్రభావంపై పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గోవాలోని జాతీయ సముద్ర సంస్థ చెబుతోంది. కోబాల్ట్, రాగి, మాంగనీస్, నికెల్, స్వల్పమోతాదుల్లో అల్యూమినియం, ఇనుము, అరుదైన ఖనిజాలు- మాలిబ్డెనమ్, టెల్యూరియం, టైటానియం వంటివాటితో నిండి ఉండే పాలిమెటాలిక్ నాడ్యూల్స్‌పై దృష్టి పెట్టారు. 2016 నాటి ఒక నివేదిక ప్రకారం భూవిజ్ఞానశాస్త్రాల మంత్రిత్వశాఖ సముద్ర గర్భంలో తవ్వకాలు, అన్వేషణలకు సంబంధించి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాల్ని అభివృద్ధిపరచి, పరీక్షించింది. 2022 నాటికి 5,500 మీటర్ల లోతులో తవ్వకాలు చేపట్టాలనే లక్ష్యంతో ఎన్‌ఐఓటీ కృషి చేస్తోంది.
సేకరించిన పదార్థాల్ని సముద్రం అడుగు నుంచి ఉపరితలంపైనుండే నౌకలోకి తరలించే వ్యవస్థలపైనా దృష్టి పెట్టారు. ఒడిశాలో అరుదైన ఖనిజాల శుద్ధి కేంద్రం ఏర్పాటుకు కృషి జరిగింది. భారీవ్యయంతో అన్వేషణ నౌకను సైతం సమకూర్చుకోనున్నారు. మనదేశం హరిత విద్యుత్తు ఉత్పత్తిపై అధికంగా దృష్టి సారించినందువల్ల ఎక్కువగా రాగి, నికెల్, కోబాల్ట్‌లపై ఆసక్తి చూపుతోంది. పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్తును నిల్వ చేసే బ్యాటరీల తయారీకి కోబాల్ట్ ఎక్కువగా అవసరం. ఇలాంటి లోహాలు భారత్‌కు వీటి అవసరం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ తరహా ఖనిజాల సరఫరాలో భారత్ స్వయంసమృద్ధిని సాధించే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక వృద్ధి కోసం సముద్ర వనరుల్ని ఉపయోగించుకోవడం ద్వారా ‘బ్లూ ఎకానమీ’పై ప్రభుత్వం దృష్టి సారించినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ముప్పు తప్పదా?
సముద్ర గర్భంలో సమృద్ధిగా ఉన్న సహజ వనరుల్ని తవ్వి తెచ్చుకోవాలనే ఉత్సాహం బాగానే ఉన్నా- దానివల్ల కలిగే నష్టం తీవ్రత తక్కువేమీ కాదన్నది నిపుణుల ఆందోళన. ‘మన సముద్రాల ఆరోగ్యానికి, మానవ మనుగడకు దగ్గరి సంబంధం ఉంది. వాటిని రక్షించుకునే దిశగా మనం ఇప్పుడే కదలకపోతే, సముద్ర అంతర్భాగంలో తవ్వకాలు అక్కడి ప్రాణులతోపాటు, మానవజాతికి విపరిణామాల్ని మిగులుస్తాయి’ అని ‘గ్రీన్‌పీస్’ నిపుణులు లూయీసా క్యాసన్ హెచ్చరిస్తున్నారు. తవ్వకాల కోసం భారీ యంత్రాలను సముద్ర గర్భానికి చేర్చడం వల్ల అక్కడి వాతావరణ వ్యవస్థ దెబ్బతింటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భారీ తవ్వకాలతో వెలువడే అవక్షేపాలు/పూడిక నిల్వలు సముద్రగర్భంలో నిల్వ ఉండే కార్బన్‌ను దెబ్బతీస్తాయి. ఇది వాతావరణ ఆత్యయిక పరిస్థితికి దారితీస్తుంది. ఫలితంగా సముద్రానికి కార్బన్‌ను నిల్వచేసుకోగలిగే సామర్థ్యం తగ్గుతుందని, అడుగున ఉండే జీవకోటీ దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పునరుత్పాదక ఇంధనం, విద్యుత్తు వాహనాలు, బ్యాటరీలు వంటి రంగాలకు చెందిన సంస్థలు ఈ విషయాన్ని పెడచెవిన పెడుతున్నాయి.
జీవవైవిధ్యానికి భారీ నష్టం...
భూమిపై పెద్దపెద్ద సంస్థలు చేపట్టిన తవ్వకాల వల్ల జరిగిన విధ్వంసం తాలూకు విపరిణామాలూ మనకు తెలిసినవే. సముద్ర గర్భంలోపలా తవ్వకాలకు అనుమతించాల్సిన అవసరం ఉందా’ అనేది మరికొంతమంది పర్యావరణవేత్తల అభ్యంతరం. సముద్రం అడుగున మరింత తీవ్రస్థాయిలో విధ్వంసం తప్పదనేది వారి ఆందోళన. సముద్రం అడుగుభాగంలో తవ్వకాల వల్ల అక్కడుండే జీవజాలంపై ఎలాంటి ప్రభావం పడుతుందనే విషయంలో ఇప్పటివరకు మనకు స్పష్టమైన అంచనా లేదు. వివిధ రకాల జీవుల మధ్య అనుసంధానాన్ని అర్థం చేసుకోకుండా, ఇలా చేయడం వల్ల జీవవైవిధ్యానికి భారీ నష్టం తప్పదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. పర్యావరణానికి జరిగే నష్టానికి పరిశ్రమ ఎలా పరిహారం చెల్లిస్తుందనే విషయంలోనూ స్పష్టత లేదు. ముందు జాగ్రత్తగా 30 నుంచి 50శాతం వరకు తవ్వకాలు జరపడానికి వీలున్న ప్రాంతాల్ని సురక్షితంగా ఉంచడం ద్వారా అక్కడి జీవవైవిధ్యాన్ని పరిరక్షించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సముద్ర అంతర్భాగంలో తవ్వకాల వల్ల భూమిపై మనుషులు, పర్యావరణంపై పడే ప్రభావాన్నీ అధ్యయనం చేయాల్సి ఉంది.
అపార నిక్షేపాల కోసమే...
ప్రపంచ దేశాలు ఖనిజాల కోసం సాగరమథనం సముద్ర గర్భంలో గనుల తవ్వకాల వల్ల పలు సమస్యలు తలెత్తుతాయని ఒకవైపు పర్యావరణవేత్తలు వాదిస్తుండగా, పరిశ్రమ వాదన అందుకు భిన్నంగా ఉంది. అంగారకుడు, చంద్రుడిపైనే అన్వేషణలు చేపడుతున్నప్పుడు సముద్రాల్ని శోధిస్తే తప్పేమిటనే వాదనలూ ఉన్నాయి. ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమిస్తూ హరిత ఆర్థిక వ్యవస్థ దిశగా పరివర్తన చెందాలంటే సముద్ర గర్భంలో నెలకొన్న విలువైన ఖనిజ పదార్థాలను వెలికి తీయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. భూమిపై ఉండే నిక్షేపాలకన్నా అక్కడ 15 రెట్లు అధిక మొత్తంలో ఉంటాయని చెబుతున్నారు. బ్యాటరీలు, కంప్యూటర్లు, ఫోన్లు వంటి సాంకేతిక పరిజ్ఞానాలకు ముడి సరకు సరఫరా చేయాలంటే ఈ నిక్షేపాలను సముద్రం నుంచి సేకరించాల్సిందేనని అంటున్నారు. అంతేకాదు, ప్రస్తుతం భూమిపై సాగిస్తున్న తవ్వకాలతో పోలిస్తే, సముద్ర గర్భంలో తవ్వకాల వల్ల పర్యావరణానికిగానీ, కార్మికులకుగానీ ముప్పు తక్కువగానే ఉంటుందంటూ తమ వాదనను సమర్థించుకుంటున్నారు.
-శ్రీనివాస్ దరెగోని