కరోనా వైరస్ పుట్టుకకు కారణమని అనుమానిస్తున్న చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం బుధవారం సందర్శించింది. కొవిడ్-19 ఆనవాళ్లను పరిశీలించే క్రమంలో.. సమగ్ర వివరాలు, ఆధారాలు సేకరించటమే లక్ష్యంగా వైరాలజీ కేంద్రాన్ని సందర్శించినట్లు నిపుణులు తెలిపారు.
వుహాన్ వైరాలజీ ల్యాబ్‌లో కరోనా మూలాలపై శోధన
కరోనా వైరస్ మూలాలపై పరిశోధన చేసేందుకు చైనాలో పర్యటిస్తోన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) బృందం.. వుహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌ను బుధవారం సందర్శించింది. వైరస్ వ్యాప్తికి వుహాన్ ప్రాంతమే ప్రధాన కారణమని ప్రపంచ దేశాలు భావిస్తోన్న తరుణంలో.. డబ్ల్యూహెచ్ఓ బృందం సేకరించే ఆధారాలు అత్యంత కీలకం కానున్నాయి.
చైనాలోనే అత్యున్నత పరిశోధన లాబొరేటరీగా వూహాన్ ల్యాబ్ గుర్తింపు పొందింది. 2003లో వచ్చిన సార్స్(సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్).. తర్వాత బ్యాట్కరోనా వైరస్ల జన్యు సమాచారాన్ని క్రోడీకరించింది. అక్కడి నుంచే కొవిడ్-19 ఏర్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించింది. కరోనా తమ దేశంలో పుట్టలేదని, మరెక్కడైనా పుట్టి ఉండవచ్చని లేదా దిగుమతి చేసుకున్న కలుషిత సముద్ర ఆహారం ద్వారా తమ దేశంలోకి ప్రవేశించి ఉండొచ్చని వాదిస్తోంది. అయితే.. అంతర్జాతీయ సంస్థలు, శాస్త్రవేత్తలు చైనా వాదనను తిరస్కరించారు.
ఇదీ చదవండి:డబ్ల్యూహెచ్ఓ పర్యటనతో చైనా కరోనా గుట్టు వీడుతుందా?