చైనాలో కరోనా వైరస్ మూలాలు గుర్తించేందుకు చైనా వెళ్లిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్యూహెచ్ఓ) నిపుణుల బృందం.. దర్యాప్తు ప్రారంభించింది. రెండు వారాల క్వారంటైన్ ముగించుకొని వుహాన్‌లో గురువారం క్షేత్రస్థాయి పరిశీలన కోసం వెళ్లింది. బృందంలోని 14 మంది సభ్యులు నెలరోజుల పాటు తమ పరిశోధనను కొనసాగించనున్నారు. మహమ్మారి మానవులకు ఎలా సంక్రమించింది అనే దానిపై అన్వేషించనున్నారు.
చైనా చేరుకున్న తర్వాత కరోనా మార్గదర్శకాలను అనుసరించి వుహాన్‌లోని ఓ హోటల్లో 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉన్నారు నిపుణులు. గురువారం బృందంలోని సభ్యులంతా హోటల్ నుంచి బయటకు వస్తూ కనిపించారు. అందులోని సభ్యులు కొందరు ఫోటోలను ట్విట్టర్లో పోస్టు చేశారు. చైనాలోని కొవిడ్ నిబంధనలను పాటిస్తూ వూహాన్ ప్రజలతో నిపుణుల బృందం మాట్లాడుతుందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ తెలిపారు.