WHO On Omicron Cases In South East Asia: ఆగ్నేయాసియాలో కొవిడ్ వ్యాప్తి శరవేగంగా పెరుగుతున్న క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కీలక సూచనలు చేసింది. కరోనా ఆంక్షలను కఠినంగా క్షేత్రస్థాయిలో అమలు చేయాలని పేర్కొంది. ఒమిక్రాన్ అంత ప్రమాదకరమైనది కాదని నిపుణులు చెబుతున్నా.. అప్రమత్తత అవసరమని స్పష్టం చేసింది.
కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్నిరకాలుగా కట్టుదిట్టమైన చర్యలను చేపట్టాలని డబ్ల్యూహెచ్ఓ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ తెలిపారు.
" కరోనా ఇంకా వ్యాప్తిచెందకుండా అధికార యంత్రాంగాలు అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎక్కడికక్కడ కఠిన నిబంధనలను అమలు చేయాలి. మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, వెంటిలేషన్, భౌతిక దూరం తదితర రూల్స్‌ను కచ్చితంగా పాటించాల్సిందే. అన్ని కొవిడ్ కేసులు ఒమిక్రాన్ కేసులు కాదు, అందులో డెల్టా వేరియంట్ కూడా ఉంటుంది."