ప్రాణాంతక కరోనా వైరస్ విషయంలో ప్రజలకు కచ్చితమైన సమాచారాన్ని అందించాలని నిర్ణయించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ). అందులో భాగంగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌తో పాటు ఫేస్బుక్, ట్విట్టర్, టెన్సెంట్లాంటి సామాజిక మాధ్యమాలతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది. సోమవారం జెనీవాలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధానోమ్ తెలిపారు.
"కరోనా వైరస్‌కు సంబంధించిన సమాచారం కోసం ప్రజలు మమ్మల్ని సంప్రదిస్తారు. వారికి కచ్చితమైన సమాచారాన్ని అందించేందుకు గూగుల్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించాం. ట్విట్టర్, ఫేస్బుక్, టెన్సెంట్, టిక్‌టాక్ వంటి సామాజిక మాధ్యమాలు తప్పుడు సమాచారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి."
-టెడ్రోస్ అదానోమ్ ఘెబ్రేయేసస్, డబ్ల్యూహెచ్ఓ చీఫ్
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా 24 దేశాలకు విస్తరించింది. చైనాలో ఇప్పటివరకు వైరస్ బారిన పడి 361 మంది చనిపోయారు. 17,200 మందికి వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. 2002లో చైనాను వణికించిన సార్స్ వైరస్‌తో పోలిస్తే కరోనా ప్రభావం ఎక్కువని విశ్లేషకులు చెబుతున్నారు.