తెలంగాణ

telangana

ETV Bharat / international

మలాలా డే: విద్యలో లింగ సమానత్వం ఇంకెప్పుడు? - మలాలా యూసఫ్‌ జాయ్

మలాలా యూసఫ్‌ జాయ్‌.. చదువుకునేందుకు కట్టుబాట్లను కాదని తాలిబాన్ల తుపాకీ గుళ్లకు ఎదురొడ్డిన పాకిస్థాన్‌ మానవ హక్కుల కార్యకర్త. మృత్యువుతో పోరాడి కోలుకున్న ఆమె.. తనలాంటి పరిస్థితి మరొక అమ్మాయికి రాకూడదనుకుంది. బాలికల విద్య, హక్కుల కోసం తనదైన శైలిలో కృషి చేస్తోంది. తన పోరాటానికి గుర్తింపుగా 2014లో 17 ఏళ్లకే నోబెల్‌ శాంతి బహుమతి పొందింది. అంతేకాకుండా ఆమె పుట్టినరోజునే(జులై 12) మలాలా దినోత్సవంగా ప్రకటించింది ఐరాస.

MALALA DAY -12 JULY
మలాలా దినోత్సవం అంటే ఏంటో తెలుసా..?

By

Published : Jul 12, 2020, 1:09 PM IST

13 ఏళ్లకే తాలిబన్ల తూటాలకు గాయపడినా.. మనోధైర్యంతో నిలబడిన యువతి మలాలా. ప్రస్తుతం పిల్లలు, బాలికల హక్కుల కోసం విశేషంగా కృషి చేస్తోంది. సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఎన్నో అంతర్జాతీయ వేదికలపై తన గళాన్ని వినిపిస్తోందీ యువకెరటం. అందుకే ఈమె చేస్తున్న సేవలను గుర్తించిన ఐకరాజ్యసమితి.. ఆమె పుట్టినరోజు(జులై 12)ను మలాలా దినోత్సవంగా ప్రకటించింది.

1997, జులై 12న పాకిస్థాన్​లోని మింగోరా అనే ప్రాంతంలో పుట్టింది మలాలా యూసఫ్‌ జాయ్‌. నేడు 23వ పడిలోకి అడుగుపెట్టిన ఈమె... 2008 నుంచి బాలికల విద్యపై పోరాడుతోంది. ఇటీవలె విద్యాభ్యాసంలోనూ చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. బ్రిటన్‌లోని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసింది.

15 ఏళ్ల వయసులో...

ఈశాన్య పాకిస్థాన్‌లోని స్వాత్‌ లోయలో తాలిబన్‌ ఉగ్రవాదులు 2012లో మలాలా తలపై కాల్చారు. అప్పటికి ఆమె వయసు 15 ఏళ్లు. ఆ ఘటనానంతరం అమెను బ్రిటన్‌ తరలించి మెరుగైన చికిత్స అందించారు. మలాలాపై దాడి పాక్​తో పాటు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విద్య అనేది ఒక హక్కుగా మార్చాలని దాదాపు 20 లక్షల మంది పిటిషన్​పై సంతకాలు చేశారు. ఆఖరికి పాకిస్థాన్​ అసెంబ్లీ సైతం దిగొచ్చి ప్రతి ఒక్కరికి ఉచిత నిర్బంధ విద్య బిల్లును పాస్​ చేసింది.

2012లో ఈ యువతికి జాతీయ యువ​ శాంతి బహుమతి అందజేసింది పాకిస్థాన్. ఈమెతోనే ఆ అవార్డు ప్రారంభమైంది. అనంతరం తాను ఎదుర్కొన్న బాధ గురించి వివరిస్తూ.. విద్యలోనూ లింగ సమానత్వం సాధించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ 2013లో ఐరాస ప్రధాన కార్యాలయంలో ఆమె మాట్లాడింది. మలాలా ప్రసంగం తర్వాత అక్కడున్న ప్రముఖులు లేచి చప్పట్లతో ప్రశంసించారు. ఆ తర్వాత యువ సామాజిక కార్యకర్త పోరాటాన్ని మెచ్చి ఆమె పుట్టినరోజును 'మలాలా డే'గా గుర్తించారు.

2014లో 17 ఏళ్లకే నోబెల్​ శాంతి బహుమతి అందుకుంది మలాలా. ఈ ఘనత సాధించిన పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. 2017లో ఐరాస శాంతి రాయబారిగాను నియమితురాలైంది. తన పోరాటంతో నేటి తరానికి ఎంతో ఆదర్శంగా నిలుస్తున్న మలాలాను ఈ దశాబ్దపు ప్రపంచ ప్రఖ్యాత టీనేజర్‌గా గుర్తించింది ఐక్యరాజ్య సమితి.

మరిన్ని విశేషాలు...

  • మలాలా ఫండ్​ ఏర్పాటు చేసి దాని ద్వారా వచ్చిన విరాళాలను మహిళల విద్య కోసం ఖర్చుచేస్తోంది యూసఫ్​ జాయ్.
  • ఈమె రాసిన 'ఐ యామ్​ మలాలా' పుస్తకం ప్రపంచవ్యాప్తంగా బెస్ట్​ సెల్లర్​గా నిలిచింది.
  • 2013లో ఐరోపా పార్లమెంటు మలాలాకు ప్రఖ్యాత షఖరోవ్​ ప్రైజ్​ను ఇచ్చింది.
  • 2015లో ఓ గ్రహ శకాలానికి మలాలా పేరును పెట్టారు.
  • కెనడా పౌరసత్వం పొందిన అత్యంత పిన్నవయస్కురాలిగా ఘనత సాధించింది.

ABOUT THE AUTHOR

...view details