కరోనా ఉత్పన్నమైన పరిస్థితులపై చైనాలోని వుహాన్‌లో పర్యటించనున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) బృందం శనివారం నుంచి రెండు రోజులపాటు బీజింగ్‌లో గడపనుంది. తమ అధ్యయనానికి ముందస్తు సన్నద్ధత కోసం అవసరమైన దిశగా కృషి చేయనుంది. ఈ బృందంలో ఓ పశువైద్య నిపుణుడు, సాంక్రమణ వ్యాధుల నిపుణుడు(ఎపిడమియాలజిస్ట్) ఉన్నారు. వైరస్.. జంతువుల నుంచి మనుషుల్లోకి ఎలా వ్యాపించిందనే అంశమై ఈ బృందం పరిశోధనలు చేయనున్నట్లు డబ్ల్యూహెచ్ఓ ప్రకటన విడుదల చేసింది.
మొదటగా గబ్బిలాల్లో వైరస్ ఉత్పన్నమైందని శాస్త్రవేత్తలు ఇప్పటివరకు విశ్వసిస్తున్నారు. పునుగు పిల్లి, పాంగోలిన్ వంటి మరో జంతువు మధ్యవర్తిగానే మానవుల్లో వ్యాపించిందని అభిప్రాయపడుతున్నారు. అయితే పూర్తిస్థాయి పరిశోధన అనంతరమే వైరస్ ఎక్కడ పుట్టిందనేది బయటపడనుంది.