కరోనా పుట్టుక, వైరస్ మూలాలపై చైనాలోని వుహాన్లో పర్యటించి.. దర్యాప్తు చేపట్టేందుకు చైనా అంగీకరించింది. ఈ మేరకు గత డిసెంబరులోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)తో ఒప్పందానికి వచ్చింది. అయితే ఈ బృందం ఎప్పుడు పర్యటించాలనేది చెప్పకుండా డ్రాగన్ దాటవేత ధోరణిని అవలంబిస్తోందనే విమర్శలు వినిస్తున్నాయి. ఈ మేరకు చైనా ఉన్నతాధికారి శనివారం చేసిన ప్రకటన దీనికి మరింత బలం చేకూరుస్తోంది.
ఆన్లైన్ ద్వారా?
నాలుగు దశల్లో జరగబోయే వీడియో కాన్ఫరెన్స్ల్లో ఈ దర్యాప్తును చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు.. వీటికి చైనా- డబ్ల్యూహెచ్ఓల మధ్య ఒక ఒప్పందం కుదిరినట్టు చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి 'జెంగ్ ఇగ్జిన్' మీడియాకు వెల్లడించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) బృందం చైనా పర్యటన.. వుహాన్లో కరోనా మూలాలపై దర్యాప్తు వంటి అంశాలపై చర్చలు పురోగతిలో ఉన్నాయని చైనా జాతీయ వైద్య కమిషన్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధుల కోసం తమ దేశ నిపుణులు ఎదురుచూస్తున్నట్టు జెంగ్ తెలిపారని గ్లోబల్ టైమ్స్ ఉటంకించింది.