విశ్వవ్యాప్తంగా విలయతాండవం చేస్తోన్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనే మార్గాలపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కొవిడ్‌ను అంతం చేసే వ్యాక్సిన్ వచ్చేలోపు 'హెర్డ్ ఇమ్యూనిటీ' ద్వారానే వైరస్ నుంచి విముక్తి పొందవచ్చనుకున్నాయి చాలా దేశాలు. కానీ, ఇప్పటివరకు అనుకున్న స్థాయిలో హెర్డ్ ఇమ్యూనిటీని సాధించలేదని స్పష్టం చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్యా స్వామినాథన్.
" కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు.. ప్రజలు శరీరంలో ప్రతిరోధకాలను వృద్ధి చేసుకోవాలి. దాదాపు 60 శాతం జనాభాలో కొంతకాలం రోగనిరోధక శక్తి సంపూర్ణంగా ఉంటేనే.. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది."
-డాక్టర్ సౌమ్యా స్వామినాథన్
డాక్టర్ సౌమ్య అంచనా ప్రకారం ప్రపంచ జనాభాలో 50-60 శాతం మంది హెర్డ్ ఇమ్యూనిటీ సాధించాల్సి ఉంది. పలు దేశాలు చేపట్టిన యాంటీబాడీల పరిశోధనల్లో.. కేవలం 5-10 శాతం మంది మాత్రమే హెర్డ్ ఇమ్యూనిటీ కలిగి ఉన్నారు. అతి కొద్ది దేశాల్లోనే 20శాతం జనాభాలో సంపూర్ణ రోగనిరోధక శక్తి ఉంది.