తెలంగాణ

telangana

ETV Bharat / international

మయన్మార్‌: 'త్రీ ఫింగర్‌ సెల్యూట్' అంటే.. - Myanmar protests news

మయన్మార్‌లో సైన్యం తిరుగుబాటు చేసిన నేపథ్యంలో ఆ దేశంలో ఆందోళనలు హోరెత్తుతున్నాయి. ఈ క్రమంలో నిరసనకారులు చేతులు పైకెత్తి చూపుతూ చేస్తోన్న కొత్త రకం సెల్యూట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత సంవత్సరం అక్టోబర్‌లో థాయ్‌లాండ్‌లో రాచరికానికి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనల్లో కూడా ఈ చిహ్నం కనిపించింది. అదే త్రీ ఫింగర్ సెల్యూట్.

What does the three finger salute
మయన్మార్‌: 'త్రీ ఫింగర్‌ సెల్యూట్' అంటే..

By

Published : Feb 13, 2021, 8:21 AM IST

మయన్మార్‌లో సైన్యం తిరుగుబాటు చేసి, కీలక నేత ఆంగ్‌ సాన్ సూకీని నిర్బంధించడంపై ఇప్పుడు ఆ దేశంలో నిరసనలు హోరెత్తుతున్నాయి. తమ ప్రియతమ ప్రజాస్వామ్య నేత సూకీని విడుదల చేయాలని, మిలిటరీ ప్రభుత్వం గద్దె దిగాలని యువత ఆందోళన బాట పట్టింది. మరోవైపు, పోలీసులు ఆందోళకారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ..నిషేధాజ్ఞలను ఉల్లంఘించారంటూ సైనిక ప్రభుత్వం వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. వీటి మధ్యలో నిరసనకారులు చేతులు పైకెత్తి చూపుతూ చేస్తోన్న కొత్త రకం సెల్యూట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రజాస్వామ్య మద్దతుదారులు ఈ చిహ్నంతో తమ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం అక్టోబర్‌లో థాయ్‌లాండ్‌లో రాచరికానికి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనల్లో కూడా ఈ చిహ్నం కనిపించింది. అదే త్రీ ఫింగర్ సెల్యూట్.

త్రీ ఫింగర్ సెల్యూట్: ఆనవాలు ఎక్కడంటే..

చేతి మధ్యలోని మూడు వేళ్లు పైకి లేపుతూ, బొటనవేలు, చిటికిన వేలును కలుపుతున్నట్టుగా ఈ సంజ్ఞ కనిపిస్తుంది. హంగర్ గేమ్స్ నవల ఆధారంగా తెరకెక్కిన హంగర్ గేమ్స్ సిరీస్‌లో ఇది కనిపిస్తుంది. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా.. సంఘీభావానికి గుర్తుగా అణగారిన ప్రజలు ఆ సినిమాలో దీన్ని ఉపయోగించారు. ఆ సినిమాలోని పాత్ర ద్వారా ఈ త్రీ ఫింగర్ సెల్యూట్ ప్రాచుర్యం పొందింది.

మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు నేపథ్యంలో నిరసనకారులు ఈ సెల్యూట్‌తో తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మాండలేలో ప్రాంతలో చేతులు పైకెత్తి, ప్లకార్డులతో ఈ తీరుగా శాంతియుత ప్రదర్శలను చేపట్టారు. 2014లో ఆగ్నేయాసియాలో ఈ సెల్యూట్ మొట్టమొదట తిరుగుబాటు వ్యతిరేక చిహ్నంగా మారింది. థాయ్‌లాండ్‌లో యువకులు షాపింగ్ మాల్‌ ముందు సమావేశమై ఆ సంవత్సరంలో జరిగిన సైనిక స్వాధీనంపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే ఇది వాడుకలోకి వచ్చింది. వ్యతిరేకతను ప్రతిబింబించే ఈ చిహ్నంపై అప్పట్లో థాయ్ ప్రభుత్వం నిషేధం విధించింది. అయినా నిరసనకారులు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా..పలు ర్యాలీల్లో దాన్ని ప్రదర్శించారు. 2014లో హాంకాంగ్‌లో జరిగిన అంబ్రెల్లా ఉద్యమంలో కూడా ఈ గుర్తుతోనే అక్కడివారు నిరసన తెలిపారు.

మయన్మార్‌లో 2010 నుంచి ప్రజాస్వామ్య సంస్కరణలు ప్రారంభమయ్యాయి. ప్రజలకు అంతర్జాలం దగ్గరైంది. క్రమంగా యువతలో దాని వాడకం పెరగడంతో..అంతర్జాతీయ పోకడలను వారు తెలుసుకోవడం ప్రారంభించారు. దాంతో ఆ నిరసన ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన చిహ్నాలు, మీమ్స్‌ను ప్రదర్శిస్తూ, తిరుగుబాటుకు వ్యతిరేకంగా బలంగా నిల్చుంటున్నారు. తాము ఎన్నుకున్న పౌర ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదీ చూడండి:'ప్రజాస్వామ్యం కోసం మాతో చేతులు కలపండి'

ABOUT THE AUTHOR

...view details