అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు(Afghan Taliban) అధికారంలోకి వస్తే భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు ఆ దేశం నిలయం అవుతుందేమోననే ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. కశ్మీర్ విషయంలో(Taliban on Kashmir) జోక్యం చేసుకోబోమని తాలిబన్లు(Taliban News) చేసిన ప్రకటనతో కాస్త ఉపశమనం లభించింది. అయితే తాజాగా తాలిబన్ ప్రతినిధి సుహైల్ షహీన్ చేసిన ప్రకటన భారత్‌ను కలవరానికి గురిచేస్తోంది. కశ్మీర్‌లోని ముస్లింల కోసం తాము పోరాడతామని బీబీసీ ఉర్దూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు స్పష్టం చేశాడు. అయితే ఏ దేశంపైకి ఆయుధాలు ఎత్తబోమని పేర్కొన్నారు.
"మాకు ఆ హక్కు ఉంది. కశ్మీర్‌లోని ముస్లింల కోసం గళమెత్తుతాం. భారత్ సహా ఏ ఇతర దేశంలోని ముస్లింల కోసమైనా పోరాడతాం. ముస్లింలు కూడా మీ సొంత ప్రజలే. మీమీ చట్టాల మేరకు వాళ్లకు కూడా సమాన హక్కులు కల్పించాలి. " అని షహీన్ పేర్కొన్నాడు.
అయితే షహీన్ చేసిన ప్రకటన కాబుల్‌ను(Kabul News) ఆక్రమించుకున్న అనంతరం తాలిబన్లు చేసిన ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఉంది. కశ్మీర్ భారత్ అంతర్గత, ద్వైపాక్షిక అంశమని, మేం జోక్యం చేసుకోమని వారు ప్రకటించారు. కానీ ఇప్పుడు షహీన్ స్టేట్మెంట్ను గమనిస్తే వారు మాట తప్పే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
భారత్ భయమదే..
అఫ్గానిస్థాన్(Afghanistan News) ఉగ్రకార్యకలాపాలకు కేంద్రబిందువు కాకుండా చూడటమే తమ లక్ష్యమని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందర్ బాగ్చీ గురువారం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ తాలిబన్లతో కతర్ వేదికగా తొలిసారి అధికారిక చర్చలు జరిపింది. మంగళవారం జరిగిన ఈ భేటీలో తాలిబన్ల నాయకుడు మహమ్మద్ అబ్బాస్ స్తానెక్జాయ్ పాల్గొన్నారు. భారత్ వ్యతిరేక కార్యకలాపాలు, తీవ్రవాదానికి అప్గాన్ నిలయం కావొద్దని చర్చ జరిగింది. అఫ్గాన్‌లో ఇంకా ఉన్న భారతీయులు, అక్కడి నుంచి భారత్ రావాలనుకుంటున్న అఫ్గాన్ పౌరుల అంశపైనా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.
తాలిబన్ల ప్రభుత్వం(Taliban Rule in Afghan) వస్తే ఇస్లామిక్ తీవ్రవాదానికి అఫ్గాన్ కేంద్రంగా మారుతుందని భారత్ ఆందోళనతో ఉంది. ఐసిస్, అల్‌ఖైదా గతంలో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నించి విఫలమయ్యాయి. సున్నీ, వహాబి ఉగ్ర సంస్థలు కూడా తాలిబన్ల రాకతో బలపడతాయనే భయాలున్నాయి.