ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. అంతే వేగంగా ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌పై వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. ఆయన ఆరోగ్యంపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ స్పందించారు.
కిమ్ ఆరోగ్యపరిస్థితులపై తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. 'కిమ్‌కు సంబంధించి.. ఉత్తరకొరియా అధికారులతో ఐరాస సంభాషించిందా?' అని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులుగా ఈ వ్యాఖ్యలు చేశారు గుటెరస్.
కరోనాపై పోరులో అమెరికా, చైనా కీలకం..
కొవిడ్-19పై పోరులో అంతర్జాతీయ స్థాయిలో చైనా, అమెరికా పాత్ర చాలా కీలకమైనదని గుటెరస్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాల అభివృద్ధికి వీరిరువురి సహకారం చాలా అవసరమని వ్యాఖ్యానించారు.
అసలేమైంది..?
రెండు వారాలుగా కిమ్ ఆరోగ్యంపై వదంతులు ఊపందుకున్నాయి. ఏప్రిల్ 15న తన తాత, ఉత్తరకొరియా వ్యవస్థాపకులు రెండో కిమ్ సంగ్ 108వ జయంతి వేడుకలకు.. గైర్హాజరైనప్పటి నుంచి కిమ్ ఆరోగ్యంపై ఊహాగానాలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఉత్తరకొరియా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
గుండె సంబంధిత శస్త్ర చికిత్స చేస్తుండగా.. కిమ్ కోమాలోకి వెళ్లారని పలువురు అనుమానిస్తున్నారు.
ట్రంప్‌దో మాట..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...కిమ్‌కు సంబంధించి మరోసారి ప్రకటన చేశారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసునని.. అంతా సజావుగానే సాగాలని ఆకాంక్షించారు. పూర్తి వివరాల గురించి ఇప్పుడే చెప్పలేనన్నారు.
పొరుగునే ఉన్న దక్షిణ కొరియా కూడా కిమ్ ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆయనకేం అయినా తమకు సమాచారం అందుతుందని ఉద్ఘాటిస్తూ వస్తోంది.