తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​ తీరే శాంతి చర్చలకు అవరోధం: అమెరికా - india pak relations

ఉగ్రవాదంపై పాక్ కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. లేని పక్షంలో భారత్​, పాకిస్థాన్​ మధ్య చర్చలు అసాధ్యమని అభిప్రాయపడింది. ఆర్టికల్​ 370 రద్దు లక్ష్యాలను సమర్థించింది.

us pak

By

Published : Oct 22, 2019, 11:50 PM IST

భారత్-పాకిస్థాన్‌ మధ్య సామరస్యపూర్వక చర్చలకు మద్దతిస్తామని అమెరికా తెలిపింది. ఉగ్రవాద సంస్థలకు పాక్‌ సహకరిస్తుండడమే చర్చలకు పెద్ద అవరోధంగా మారిందని ఆ దేశ విదేశాంగ శాఖ ఉప కమిటీకి ఆసియా-పసిఫిక్‌ విభాగం అధిపతి అలైస్ జీ వెల్స్‌ స్పష్టం చేశారు.

2006-07 సమయంలో ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల్లో కశ్మీర్‌ సహా పలు అంశాల్లో మంచి పురోగతి కనిపించిందని గుర్తు చేశారు. తిరిగి అలాంటి వాతావరణం నెలకొనాలంటే పాకిస్థాన్‌ ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు.

అలైస్ జీ వెల్స్​, అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి

"మేం పాకిస్థాన్​కు స్పష్టంగా చెబుతున్నాం. లష్కర్​-ఈ-తొయిబా, జైషే మహ్మద్​ ఉగ్రసంస్థలపై వాళ్లు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నియంత్రణ రేఖ వద్ద హింసను విడనాడాలి."

-అలైస్ జీ వెల్స్​, అమెరికావిదేశాంగ శాఖ ఉప కమిటీకి ఆసియా- పసిఫిక్‌ విభాగం చీఫ్​

అధికరణ రద్దుపై..

కశ్మీర్‌లో అధికరణ 370 రద్దుతో ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామన్న భారత్‌ లక్ష్యాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పాలకవర్గం స్వాగతించింది. అయితే రద్దు నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా తీసుకున్న ఆంక్షలపై కాస్త ఆందోళన వ్యక్తం చేసింది. కశ్మీర్‌లో పరిస్థితులు చక్కబడుతున్న కొద్దీ భారత ప్రభుత్వం నిషేదాజ్ఞలు ఎత్తివేస్తూ వస్తుందని చెబుతూనే.. ఇంకా అనేక ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనాల్సి ఉందని అలైస్ జి వెల్స్‌ నివేదించారు.

అయితే లోయలో సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అందులో భాగంగా ఇటీవల పునఃప్రారంభించిన మొబైల్‌ సేవలు, పర్యాటక అనుమతులు, నేతల విడుదల చర్యల్ని ఉటంకించారు.

అధికరణ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులను అమెరికా దగ్గరగా గమనిస్తోందని కమిటీకి వెల్స్‌ తెలిపారు. అక్కడక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, నేతల నిర్బంధంపై భారత్‌తో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నామన్నారు. సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details