దేశ భద్రత, ప్రయోజనాల దృష్ట్యా తాలిబన్లతో పాకిస్థాన్(Taliban Pakistan) నిరంతర సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పాక్ సైన్యాధికారి మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తికార్(Major General Babar Iftikhar) తెలిపారు. 'వారి ఉద్దేశాలు, లక్ష్యాలను అనుమానించేందుకు మాకు(పాకిస్థాన్‌కు) ఎటువంటి కారణం కనబడలేదు. అందుకే వారితో నిరంతరం టచ్‌లో ఉన్నాం. తాలిబన్లు మా జాతీయ ప్రయోజనాలను కాపాడతారు' అని ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
"పాకిస్థాన్ సహా ఏ దేశానికి వ్యతిరేకంగానూ ఉగ్రవాద కార్యకలాపాలకు అఫ్గాన్ భూభాగాన్ని ఉపయోగించమని, ముష్కర సంస్థలను అనుమతించబోమని తాలిబన్లు అనేక సందర్భాల్లో పునరుద్ఘాటించారు."
-మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తికార్, పాక్ సైనిక ప్రతినిధి
మరోవైపు ఉగ్రవాదులు పాక్ భూభాగంలోకి ప్రవేశించకుండా పాక్ అధికారులు, తాలిబన్ల మధ్య చర్చలు(Pak Afghan Peace Talks) జరిగినట్లు 'డాన్' వార్తాపత్రిక(DAWN Newspaper) ఓ కథనాన్ని ప్రచురించింది. వాస్తవానికి అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ)(TTP in Pakistan) దాడులు పెరిగాయి. దీనిపై తాలిబన్లను నిందించేందుకు పాక్ అధికారులు సిద్ధంగా లేరు. సరిహద్దు ప్రాంతాలపై తాలిబన్లు ఇంకా పూర్తిస్థాయిలో పట్టు సాధించలేదని చెబుతూ.. వారి వైఖరిని సమర్థించుకుంటున్నారు.