తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా ఎన్నికలపై చైనా 'శాంతి' మంత్రం

అమెరికా-చైనా మధ్య కొంతకాలంగా ప్రచ్చన్న యుద్ధం నడుస్తోంది. ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్న వేళ.. తాజాగా అగ్రరాజ్య ఎన్నికలపై శాంతిమంత్రం పఠిస్తోంది చైనా. అధ్యక్ష ఎన్నికలు సాఫీగా ముగియాలంటూ సానుకూల వ్యాఖ్యలు చేసింది. ఇరుదేశాల సహాయ, సహకారాల కోసం సరైన వేదిక లభిస్తుందని ఆశాభావంగా ఉన్నట్టు పేర్కొంది.

US-Presidential-poll
అమెరికా ఎన్నికలపై చైనా 'శాంతి' మంత్రం

By

Published : Nov 5, 2020, 6:41 PM IST

అగ్రరాజ్యంతో సంబంధాలు మరింత వికటిస్తున్న వేళ శాంతిమంత్రం పఠిస్తోంది చైనా. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సాఫీగా ముగియాలంటూ సానుకూల వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో రెండు దేశాల పరస్పర సహాయ సహకారాల కోసం సరైన వేదిక వస్తుందని భవిష్యత్‌ సత్సంబంధాలపై ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

రాబోయే అమెరికా ప్రభుత్వంతో చైనా సంబంధాలు మెరుగుపడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు చైనా విదేశాంగ శాఖ సహాయ మంత్రి లీ యుచెంగ్​.

" అమెరికా అధ్యక్ష ఎన్నికలను చైనా ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇంకా అక్కడ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పుడే ఫలితాలు రాకపోవచ్చు. అయితే ఈ ఎన్నికల ప్రక్రియా సాఫీగా, విజయవంతంగా ముగుస్తుందని ఆశిస్తున్నాం. చైనా-అమెరికా బంధం గురించి వస్తే.. చైనా తీరు స్పష్టంగా, స్థిరంగా ఉంది. రెండు దేశాల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. సహాయ సహకారాలు అందించుకునేందుకు సరైన వేదిక తప్పకుండా లభిస్తుంది."

- లీ యుచెంగ్‌, చైనా విదేశాంగశాఖ సహాయ మంత్రి.

అమెరికా-చైనా మధ్య గత రెండేళ్లుగా వాణిజ్య యుద్ధం నెలకొంది. ఆ తర్వాత దక్షిణ చైనా సముద్రం, తైవాన్‌, కరోనా తదితర విషయాల్లోనూ డ్రాగన్‌ దేశంపై అగ్రరాజ్యం గుర్రుగా ఉంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పలు అంతర్జాతీయ వేదికలపై బీజింగ్‌ను ఎండగట్టారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు బలహీనంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వంతోనైనా సంబంధాలు మెరుగుపర్చుకోవాలని చైనా ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉండగా.. అమెరికా తదుపరి అధ్యక్షుడు ట్రంప్‌ అయినా.. బైడెన్‌ అయినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అది బైడెన్‌ అయినా.. ట్రంప్‌ అయినా.. చైనా పట్ల అమెరికా కఠిన విధానాలనే పాటించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

ఇదీ చూడండి: ట్రంప్​ X బైడెన్​: టాప్​ 10 హైలైట్స్

ABOUT THE AUTHOR

...view details