చైనాలో ప్రపంచంలోనే అతిపెద్ద వర్చువల్ రియాలిటీ (వీఆర్) థీమ్ పార్కు ప్రారంభమైంది. ఈ వీఆర్ పార్కు ప్రత్యక్ష అనుభూతిని అందిస్తూ చైనా వాసులను ఆకట్టుకుంటోంది. వీఆర్ బంపర్ కార్లు మొదలుకొని వీఆర్ షూటింగ్, వీఆర్ విమాన ప్రయాణం ఇలా మొత్తం 42 రకాల వీఆర్ గేమ్‌లను ఈ పార్కులో అందుబాటులో ఉంచారు నిర్వాహకులు.
సంప్రదాయ పార్కులు అందించే ఆహ్లాదాన్ని ఇక్కడ అందిస్తున్నారు నిర్వాహకులు. వీఆర్ థీమ్ పార్కుల కన్నా సంప్రదాయ పార్కులు చాలా పెద్దగా ఉంటాయని.. వాటిని నిర్మించేందుకు కూడా ఎక్కువ సమయం పడుతుందని అంటున్నారు.
ఓ రిపోర్టర్ ద్వారా వీఆర్ పార్కు గురించి తెలుసుకున్నారు లియూ జిగ్సింగ్ అనే వ్యాపారవేత్త. మొదటి సారి వర్చువల్ రియాలిటీ రైడింగ్‌ను ఆస్వాదించాలని భావించారు. ఇందుకోసం వందలాది కిలోమీటర్లు ప్రయాణించి పార్కుకు వచ్చారాయన. మొదటి సారి వర్చువల్ రియాలిటీ రైడింగ్ చేసిన ఆయన వర్చువల్ సాంకేతికత ద్వారా కూడా నిజమైన అనుభూతినే పొందానని అంటున్నారు. వర్చువల్ రియాలిటీ ఎంతో అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు.
"భవిష్యత్‌లో ఈ సాంకేతికత చాలా గొప్పగా పని చేస్తుంది. నిజంగా ఇది అత్యున్నత సాంకేతికత. మొదటి సారి వీఆర్ అనుభూతి పొందాను. ఇది చాలా బాగుంది"
-లియూ జిగ్సింగ్, వ్యాపారవేత్త