కరోనా లాక్డౌన్ కొనసాగుతున్న వేళ ప్రపంచవ్యాప్తంగా కండోమ్‌ల కొరత తీవ్రం కానుంది. కర్మాగారాలు మూతపడటం, సరఫరా వ్యవస్థ నిలిచిపోవటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న కారణంగా ప్రపంచవ్యాప్తంగా 50 శాతం మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసరం కాని వ్యాపారాలపై ఆయా దేశాల ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో కండోమ్ ఉత్పత్తి భారీగా పడిపోయింది.
లాక్డౌన్ కారణంగా..
మలేసియా.. రబ్బరు ఉత్పత్తుల్లో ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉంది. కండోమ్ ఉత్పత్తి దేశాల్లో ప్రధానమైనది. అయితే ఈ దేశంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గత నెలలో వంద శాతం లాక్డౌన్ అమలు చేసింది అక్కడి ప్రభుత్వం.
ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ప్రతి ఐదు కండోమ్‌లలో ఒకటి మలేసియాలోని కారెక్స్ సంస్థలోనే తయారవుతుంది. ప్రపంచంలోని చాలా కంపెనీలు, ప్రభుత్వాలకు కండోమ్ సరఫరా చేస్తుంది. లాక్డౌన్ వల్ల మలేసియాలోని కారెక్స్ సంస్థకు చెందిన 3 ప్లాంట్లలో కార్యకలాపాలు నిలిచిపోయాయి.
అనేక ఇబ్బందులు..
ప్రభుత్వం నుంచి అనుమతి లభించాక 50 శాతం ఉద్యోగులతో తిరిగి కార్యకలాపాలు ప్రారంభించింది కారెక్స్. కానీ... మానవ వనరుల కొరతతో ఉత్పత్తిని 20 కోట్ల యూనిట్ల మేర తగ్గించింది. రవాణా సమస్యలతో మార్కెట్లోకి కండోమ్ సరఫరా కష్టమవుతోందని కారెక్స్ సీఈఓ గోమియా కియత్ తెలిపారు.
"ప్రపంచం కచ్చితంగా కండోమ్ కొరతను ఎదుర్కొంటోంది. చాలా సమస్యలు ఉన్నాయి. ఇది ఆందోళనకరమైన విషయం. ఎందుకంటే కండోమ్ అత్యవసరమైనది. మనం కరోనాతో పోరాడుతున్నాం. కానీ కొరతను తగ్గించేందుకు మా వంతు కృషి చేస్తున్నాం."
- గోమియా కియత్, కారెక్స్ సీఈఓ