చైనాలోని తియాన్జిన్, షాంఘై, మంజౌలీ నగరాల్లో చలి తీవ్రత పెరిగింది. దీంతో ఈ మూడు నగరాల్లో కరోనా వ్యాప్తి చెందుతోంది. కొత్తగా షాంఘైలో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో శుక్రవారం నుంచి నగరంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య ఏడుకు చేరింది. ఈ నగరంలోని పుదోంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని 17,719మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. తియాన్జిన్లో గతవారం ఐదు కేసులు నమోదవటంతో ఆ ప్రాంతంలో దాదాపు 20లక్షల మందికి పైగా కొవిడ్ టెస్టులు చేశారు. మంజౌలీలో శనివారం కొత్తగా రెండు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం చైనాలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 86,442గా ఉంది. ఇప్పటివరకు కరోనా బారిన పడి 4,634 మంది మరణించారు.
వరుసగా 16వరోజు తగ్గుదల
భారత్లో వరుసగా 16వ రోజు కేసుల సంఖ్య 50వేల కంటే తక్కువగా నమోదైంది. దేశంలో కొత్తగా 44,059 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 91 లక్షలు దాటింది. కొత్తగా 511మంది కరోనాతో మరణించగా మొత్తం మరణాల సంఖ్య 1,33,738గా ఉంది. ప్రస్తుతం భారత్లో 4,43,486 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇది మొత్తం కేసుల్లో 4.85శాతం.
ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 93శాతంగా ఉంది. మొత్తం రికవరీ కేసుల్లో దాదాపు 77.44 శాతం కేసులు 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే నమోదవుతున్నాయి. కేరళ, దిల్లీ, మహారాష్ట్రలో రికవరీ రేటు అధికంగా ఉంది.