తెలంగాణ

telangana

ETV Bharat / international

విమానం రెక్కలపైకి ఎక్కిన అఫ్గాన్​ ప్రజలు..! - plane service stopped in afghanistan

తాలిబన్లు కాబూల్​ను వారి అధీనంలోకి తెచ్చుకోగానే అఫ్గాన్లలో ప్రాణభయం మొదలైంది. దీంతో నగరంలోని వారంతా విదేశాల బాట పడుతున్నారు. దీనికి తోడు దేశాధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ అఫ్గాన్​ను వదిలి వెళ్లారనే వార్త తెలియగానే ప్రజలంతా ఉక్కిరి బిక్కిరయ్యారు. పెద్ద సంఖ్యలో కాబూల్​ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సమయంలో అమెరికా బలగాలు కాల్పులు కూడా జరిపాయి. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

chaotic scenes at the Kabul airport
అఫ్గాన్​లో పరిస్థితులు

By

Published : Aug 16, 2021, 12:22 PM IST

Updated : Aug 16, 2021, 2:47 PM IST

అఫ్గాన్ల ప్రాణ భయానికి నిదర్శనం కాబూల్‌ ఎయిర్‌పోర్టు

లాక్‌డౌన్‌ ప్రకటించగానే మన దేశంలో రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు కిక్కిరిసిపోవడం.. ప్రజలు వాహనాలు ఎక్కేందుకు ఎగబడటం చూశాం కదా.. ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయ పరిస్థితి అలానే ఉంది. వేలమంది ప్రజలు దేశం వీడేందుకు ఏకంగా విమానాల వద్దకే పరుగులు పెడుతున్నారు.

రాజధాని కాబూల్‌ను తాలిబన్లు చుట్టుముట్టారన్న వార్త తెలియగానే నగరవాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విమానాశ్రయాల బాటపట్టారు. దేశంలోని వివిధ రాష్ట్రాల రాజధానులను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో చాలా మంది మొదట కాబూల్‌కు వలసవచ్చారు. ఇక్కడ ప్రభుత్వ బలగాలు ఎక్కువగా ఉండటంతో ముష్కర మూకలను అడ్డుకొంటాయని వారు ఆశించారు. కానీ, ఊహించిన దానికన్నా వేగంగా తాలిబన్లు రాజధానిని చుట్టుముట్టడంతో ప్రజలు ఒక్కసారిగా హతాశులయ్యారు.

పెద్ద సంఖ్యలో ఎయిర్​పోర్టుకు చేరుకున్న అఫ్గాన్లు

అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయిన వార్త తెలుసుకోగానే.. వేల మంది నగరవాసులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, మంత్రులు, మహిళలు ప్రాణభయంతో చేతికి అందిన సామగ్రి తీసుకొని దేశం విడిచి పెట్టి వెళ్లేందుకు విమానాశ్రయం చేరుకొన్నారు. దీంతో హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోని పౌర టెర్మినల్‌ కిక్కిరిసిపోయింది. ఒక్కో విమానం వద్ద వందల సంఖ్యలో ప్రజలు గుమిగూడిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఎయిర్​పోర్ట్​లో ఎదురు చూస్తున్న ప్రజలు

కాల్పుల చప్పుడుతో పరుగులు..

ప్రజలు ఒక్కసారిగా విమానాల వద్దకు చొచ్చుకురావడంతో అక్కడ ఉన్న అమెరికా భద్రతా సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రస్తుతం కాబూల్‌ విమానాశ్రయం తాలిబన్ల గురిలోకి వచ్చిందని అమెరికా దౌత్య కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతేకాదు అమెరికా దౌత్య ఉద్యోగులను హెలికాప్టర్లలో ఎయిర్‌పోర్టుకు తరలించింది.

కాబూల్​ ఎయిర్​పోర్టులో దృశ్యాలు

129 మంది ప్రయాణికులతో దిల్లీకి చేరిన విమానం..

ఎయిర్‌ ఇండియా విమానం 129 మంది ప్రయాణికులతో నిన్న రాత్రి దిల్లీకి చేరుకొంది. రాత్రి 8 గంటల సమయంలో ఇది రన్‌వేపై దిగింది. మరోపక్క కాబూల్‌ నుంచి దిల్లీకి వరుసగా విమానాలను నడిపేందుకు ఎయిర్‌ ఇండియా సిబ్బందిని సిద్ధం చేస్తోంది. రెండు విమానాలను అత్యవసరాల కోసం సిద్ధంగా ఉంచింది. అఫ్గానిస్థాన్‌కు వెళ్లే విమానాన్ని మధ్యాహ్నం 12.30కు రీషెడ్యూల్‌ చేసింది. వాస్తవానికి ఈ విమానం రాత్రి 8.50కు వెళ్లాల్సి ఉంది.

నిలిచిన విమాన సర్వీసులు...

అఫ్గానిస్థాన్​లో గగనతలాన్ని అధికారులు మూసేశారు. దీంతో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. కాబూల్‌ విమానాశ్రయం నుంచి కూడా విమానాలు నిలిపి వేసినట్లు ప్రకటించారు. రద్దీని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దేశం విడిచి వెళ్లేందుకు విమానాశ్రయానికి భారీ సంఖ్యలో అఫ్గాన్‌ పౌరులు పోటెత్తున్నారు. దీంతో కాబూల్‌ విమానాశ్రయంలో భారీ రద్దీ ఏర్పడింది. తాలిబన్ల పాలనలోకి అఫ్గానిస్థాన్‌ వెళ్లడంతో.. ఆ దేశం మీదుగా అమెరికా నుంచి భారత్‌కు వచ్చే విమానాలను దారి మళ్లించినట్లు ఎయిర్​ పోర్ట్​ వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి:అఫ్గాన్ ప్రజల కళ్లముందు మెదులుతున్న క్రూర పాలన

Last Updated : Aug 16, 2021, 2:47 PM IST

ABOUT THE AUTHOR

...view details