కరోనా వైరస్ మహమ్మారి ఎదుర్కోవడంలో భాగంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు వ్యాక్సిన్‌లు తుదిదశ ప్రయోగాల్లో ఉన్నాయి. వీటిలో చైనా కంపెనీలు అభివృద్ధి చేసిన నాలుగు వ్యాక్సిన్‌లు తుదిదశ మానవ ప్రయోగాల్లో ఉన్నాయి. తాజాగా వీటిలో మూడు టీకాలు నవంబర్ నాటికి ప్రజా వినియోగానికి అందుబాటులోకి రావచ్చని చైనా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) వెల్లడించింది. 'మూడోదశలో ఉన్న ఈ టీకా ప్రయోగాలు సాఫీగా సాగుతున్నాయి. ఇవి నవంబరు లేదా డిసెంబరు నాటికి సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది' అని చైనా సీడీసీ బయోసేఫ్టీ నిపుణులు గైఝెన్ వూ అక్కడి అధికారిక మీడియాలో పేర్కొన్నారు. గత ఏప్రిల్‌లో తాను కూడా వ్యాక్సిన్‌ను తీసుకున్నట్లు వెల్లడించిన గైఝెన్ వూ, ఇప్పటివరకు ఎలాంటి అసాధారణ లక్షణాలు కనిపించలేదని స్పష్టం చేశారు. అయితే, నాలుగు వ్యాక్సిన్‌లలో ఏ వ్యాక్సిన్‌ను తీసుకున్నారనే విషయాన్ని మాత్రం ఆమె తెలియజేయలేదు.
చైనా జాతీయ ఫార్మా గ్రూప్(సినోఫార్మ్), సినోవాక్ బయోటెక్‌తో కలిసి మూడు వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేశాయి. ఇప్పటికే వీటి ప్రయోగాలు చైనాతోపాటు యూఏఈలోనూ కొనసాగుతున్నాయి. మూడో దశ ప్రయోగాలు ముగిసిన తర్వాత ఈ ఏడాది చివరి నాటికే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని సినోఫార్మ్ జులై నెలలోనే ప్రకటించింది. ఇక చైనాకు చెందిన కాన్‌సినో బయోలాజిక్స్ తయారుచేసిన మరో వ్యాక్సిన్ కూడా తుది దశ ప్రయోగాల్లో ఉండగా..ఇప్పటికే చైనా సైన్యం దీన్ని వినియోగించేందుకు జూన్‌లోనే అనుమతులు వచ్చాయి.
ఆసక్తి రేపుతున్న చైనా..