అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా, నాటో బలగాల ఉపసంహరణ(us troops withdrawal from afghanistan)కు గడువు కొద్ది గంటల్లో ముగియనుంది. దేశం విడిచి వెళ్లేందుకు ఆగస్టు 31 చివరి తేదీ కాగా.. ఆ లోపు తమకు సహకరించిన పౌరులను వెనక్కి తీసుకొచ్చేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది.
అఫ్గాన్‌లో సుమారు 300 మంది అమెరికా పౌరులు దేశం విడిచి రావాలని అనుకుంటున్నారని, వారిని వెనక్కి తీసుకొచ్చే సామర్థ్యం తమకు ఉందని శ్వేతసౌధ అధికారులు వెల్లడించారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వారం రోజుల క్రితమే పౌరుల తరలింపు ప్రక్రియను అమెరికా(us evacuation from afghanistan) వేగవంతం చేసింది. కాబుల్ ఎయిర్పోర్ట్ వద్ద వరుస ఆత్మాహుతి దాడులు(kabul airport attack) జరిగిన తర్వాత కూడా ఈ వేగాన్ని కొనసాగిస్తోంది. అప్రమత్తంగా ఉంటూనే.. ప్రజలను తీసుకొస్తోంది.
ఏంటీ డెడ్‌లైన్?
ట్విన్ టవర్స్‌పై దాడి తర్వాత అఫ్గాన్‌లో అల్‌ఖైదాపై ప్రతీకారం తీర్చుకోవడానికి అఫ్గానిస్థాన్‌లో అమెరికా దళాలు 2001లో అడుగుపెట్టాయి. దేశంలోని తాలిబన్ల ప్రభుత్వాన్ని పడగొట్టి.. ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసింది అగ్రరాజ్యం. ఈ ఘటన జరిగి 20 ఏళ్లు కావొస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి వైదొలగాలని అమెరికా భావించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ మేరకు తాలిబన్లతో శాంతి ఒప్పందం(taliban peace deal) చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం అఫ్గాన్‌లోని 13 వేల మంది అమెరికా దళాలను వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిగా అల్‌ఖైదాతో సంబంధాలు తెంచుకుంటామని తాలిబన్లు అంగీకరించారు. అమెరికా దళాలపై దాడులు చేయబోమని స్పష్టం చేశారు. ఒప్పందం ప్రకారం 2021 మే 1 నాటికే బలగాల ఉపసంహరణ పూర్తి కావాలి. అయితే, దీన్ని తర్వాత సవరించారు. ఆగస్టు 31ని చివరి తేదీ(us deadline to leave afghanistan)గా నిర్ణయించారు.
తరలింపు ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చింది?
ఎన్ని సవాళ్లు ఎదురైనా.. అత్యంత వేగంగా పౌరులను తరలిస్తోంది అమెరికా. ఇప్పటివరకు సుమారు 1,14,400 మందిని అఫ్గాన్ నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. అమెరికా పౌరులే కాకుండా గత 20 ఏళ్లలో తమకు సహకరించిన అఫ్గాన్ వాసులు సైతం ఇందులో ఉన్నారు. ప్రస్తుతం అఫ్గాన్‌లో 4000 మంది అమెరికా సైనికులు ఉన్నట్లు సమాచారం. వీరంతా అఫ్గాన్ ఎయిర్పోర్ట్ వద్దే పహారా కాస్తున్నారు.
రాకెట్ల దాడులతో...
బలగాల ఉపసంహరణ, పౌరుల తరలింపు ప్రక్రియకు ఉగ్రవాదుల నుంచి పెను ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే కాబుల్ ఎయిర్పోర్ట్ లక్ష్యంగా ఐసిస్-కే ముష్కరులు దాడులకు(isis k attack) పాల్పడ్డారు. గురువారం జరిగిన ఆత్మాహుతి దాడుల్లో సుమారు 180 మంది మరణించారు. ఇందులో 13 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారు.