Ukraine Russia war: 2022లో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యలకు ఉపక్రమించనుందని అమెరికా నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈ నేపథ్యంలో రష్యాను ఎట్టిపరిస్థితుల్లోనైనా అడ్డుకుంటామని అమెరికా అధ్యక్షు జో బైడెన్ స్పష్టం చేశారు.
ఉక్రెయిన్ సరిహద్దుల్లో దాదాపు 1.75లక్షల మంది సైనికులను మోహరించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రణాళికలు రచిస్తున్నారని అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. వీరిలో సగానికిపైగా సైనికులు ఇప్పటికే సరిహద్దుల్లో ఉన్నట్టు పేర్కొన్నాయి. ఆర్మీ, ఆయుధాలు, సామగ్రితో కూడిన 100 బెటాలియన్లు సరిహద్దుల్లోకి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నట్టు వెల్లడించాయి.
తాజా పరిణామాలపై బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు.
"ఉక్రెయిన్‌పై రష్యా చర్యలను ఎంతో కాలంగా మేము చూస్తూనే ఉన్నాము. ఈ విషయంపై పుతిన్‌తో సుదీర్ఘంగా చర్చించాల్సి ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా ఎలాంటి చర్యలు చేపట్టినా, అందుకు మేము వ్యతిరేకం. మిస్టర్. పుతిన్‌ను అడ్డుకునేందుకు మేము అన్ని సిద్ధం చేస్తాము."
-- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు.
Ukraine Russia conflict రష్యా-ఉక్రెయిన్ మధ్య సరిహద్దు వివాదాలు గత కొంతకాలంగా తీవ్రరూపం దాల్చాయి. అదే సమయంలో నాటోతో సంబంధాలు ఏర్పరచుకునేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తోంది. దీనిని రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నాటోకు ఇప్పటికే హెచ్చరికలు పంపింది. ఉక్రెయిన్.. నాటోలో చేరకుండా చూడాలని, హామీనివ్వాలని అమెరికాను పట్టుబట్టింది రష్యా.
పుతిన్ సాహసం చేస్తారా?
క్షేత్రస్థాయిలో తన సైన్యాన్ని మునుపెన్నడూ లేనంత శక్తివంతంగా తీర్చిదిద్దారు పుతిన్. అయితే.. ఉక్రెయిన్‌పై దాడి చేయడం పుతిన్ ప్రభుత్వానికి చాలా రిస్క్‌తో కూడిన వ్యవహారం. రిస్క్ చేసి ముందుకెళితే పాశ్చాత్య దేశాలు విధించే ఆంక్షలతో రష్యా ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి.
వివాదం ఏంటి?
Russia Ukraine invasion: రష్యా- ఉక్రెయిన్ మధ్య వివాదం 2014 నాటిది. నాడు.. ఇరు దేశాల సరిహద్దు భాగమైన క్రిమియాను రష్యా ఆక్రమించుకుంది. అప్పటి నుంచి రష్యా మద్దతున్న వేర్పాటువాదులు- ఉక్రెయిన్ బలగాల మధ్య అనేకమార్లు ఘర్షణ చెలరేగింది. ఈ గొడవల్లో దాదాపు 14వేల మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంచనా. అయితే 2020లో ఇరు పక్షాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో పరిస్థితి కొంత చల్లబడింది. కానీ ఈ ఏడాది తొలినాళ్లలో సరిహద్దుల్లో కాల్పుల ఘటనలు మొదలయ్యాయి. అప్పటి నుంచి సరిహద్దుల్లో బలగాల సంఖ్యను పెంచుతూ వస్తోంది రష్యా.
ఇదీ చూడండి:-ఆ రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదా?