అఫ్గానిస్థాన్‌లోని తమ బలగాల తరలింపును ముమ్మరం చేసింది అమెరికా. తాలిబన్లు, అల్‌ఖైదా ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ప్రధాన కేంద్రంగా చేసుకున్న బగ్రామ్ ఎయిర్‌ఫీల్డ్‌ను.. సుమారు 20 ఏళ్ల తర్వాత ఖాళీ చేసింది.
బగ్రామ్ ఎయిర్‌ఫీల్డ్‌ను అఫ్గాన్ జాతీయ భద్రతా, రక్షణ బలగాలకు అప్పగించినట్లు అమెరికా అధికారులు తెలిపారు. అయితే.. బలగాల రక్షణకు అఫ్గాన్‌లోని అమెరికా టాప్ కమాండర్ జనరల్ ఆస్టిన్ ఎస్ మిల్లర్ అన్ని అధికారాలను కలిగి ఉన్నారని చెప్పారు.
కీలక ఎయిర్‌ఫీల్డ్ నుంచి బలగాల తరలింపు.. సెప్టెంబర్ 11 లోపు పూర్తిస్థాయిలో సైన్యం ఉపసంహరణకు అగ్రరాజ్య అధ్యక్షుడు జోబైడెన్ ఇచ్చిన హామీని సూచిస్తోంది. ప్రస్తుతం అక్కడ 2,500-3,500 వరకు అమెరికా బలగాలు ఉన్నట్లు సమాచారం. అయితే.. చివరి సైనికుడిని ఎప్పుడు తరలిస్తారనే అంశంపై ఎలాంటి స్పష్టత నివ్వలేదు అమెరికా. కాబుల్ హమిద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయ భద్రతపై చర్చలు కొనసాగుతున్నాయని, భద్రతకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఎయిర్‌పోర్టుకు టర్కీ, అమెరికా సైనికులు పహారా కాస్తున్నారు.