అఫ్గానిస్థాన్(Afghan news) విషయంలో అమెరికాపై చైనా మరోసారి విమర్శలు చేసింది. యుద్ధంతో నష్టపోయిన అఫ్గాన్‌ను(Afghan crisis) అంత తేలిగ్గా వదిలేయకూడదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ సూచించారు. సోమవారం ఆయన బీజింగ్‌లో మీడియాతో మాట్లాడారు. అఫ్గాన్‌లో సమస్యకు అమెరికానే మూల కారణమని, ఇందులో ఆ దేశమే అతి పెద్ద బాహ్య కారకంగా పనిచేసిందని ఆరోపించారు. అందువల్ల అమెరికా ఇలా పారిపోరాదని, అఫ్గాన్‌లో సుస్థిరత కొనసాగించేందుకు, గందరగోళ పరిస్థితులను తొలగించి ఆ దేశ పునర్నిర్మాణానికి బాధ్యతతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
మాటలను చేతలతో రుజువు చేసేలా అక్కడ అభివృద్ధి, పునర్నిర్మాణం దిశగా బాధ్యతతో మానవతా దృక్పథంతో అగ్రరాజ్యం వ్యవహరిస్తుందని ఆశిస్తున్నట్టు వాంగ్ పేర్కొన్నారు. యుద్ధంతో తీవ్రంగా దెబ్బతిన్న అఫ్గాన్‌లో తాలిబన్లతో పాటు అన్ని పార్టీలతోనూ కలిసి పని చేసేందుకు తాము సిద్ధమేనంటూ చైనా చెబుతోంది.
ఆర్థిక సాయం..
తాలిబన్ ఆక్రమిత అఫ్గాన్‌కు(taliban afghanistan) ఆర్థికంగా సాయం చేసేందుకు ముందడుగు వేయనున్నట్లు వెన్‌బిన్ పరోక్షంగా తెలిపారు. ప్రపంచ దేశాలు అఫ్గాన్‌కు ఆర్థిక సాయం విషయంలో వెనక్కు తగ్గుతున్న నేపథ్యంలో వెన్‌బిన్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. అమెరికాకు బదులుగా అర్థిక సాయం కోసం తాలిబన్లు.. చైనా, పాకిస్థాన్ వైపు చూస్తారనే అంశంపై వెన్‌బిన్ ఈ విధంగా స్పందించారు.
మరింత దిగజారనున్న పరిస్థితులు..
కరువు, శీతాకాల పరిస్థితులు, కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా అఫ్గాన్‌లో మానవతా పరిస్థితులు మరింత దిగజారుతాయని ఐక్యరాజ్యసమితి చిన్నపిల్లల విభాగం యూనిసెఫ్(unicef afghanistan) అభిప్రాయపడింది. ఇప్పటికే అఫ్గాన్‌లో కోటి మంది చిన్నారులు మానవతా సాయం పొందుతున్నారని, మరో 10 లక్షల మంది పిల్లలు రానున్న రోజుల్లో పోషకాహారలోపం సమస్యను ఎదుర్కోనున్నారని తెలిపింది. 22లక్షల మంది బాలికలతో సహా 42 లక్షల మంది చిన్నారులు పాఠశాలలకు దూరమవుతారని పేర్కొంది.