తెలంగాణ

telangana

ETV Bharat / international

'మసూద్​'పై ఐరాస నిర్ణయం నేడే - మసూద్​ అజార్

తీవ్రవాద సంస్థ జైషే మహ్మద్​ స్థాపకుడు మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదనపై నేడు ఐక్యరాజ్యసమితి భద్రత మండలి నిర్ణయం తీసుకోనుంది. పుల్వామా ఘటన అనంతరం గత నెల 27న ఫ్రాన్స్​, బ్రిటన్​, అమెరికా ఐరాస ముందుకు ఈ ప్రతిపాదన తెచ్చాయి.

'మసూద్​'పై ఐరాస నిర్ణయం నేడే

By

Published : Mar 13, 2019, 1:03 PM IST

పుల్వామా ఉగ్రదాడితో ఎంతోమంది జవాన్ల మరణానికి కారణమయింది జైషే మహ్మద్​ ఉగ్రవాద సంస్థ. ఈ ముఠా వ్యవస్థాపకుడు మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలనే ప్రతిపాదనపై నేడు నిర్ణయం వెలువరించనుంది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి. గతనెల 27న ఫ్రాన్స్​, బ్రిటన్​, అమెరికా చేసిన ఈ ప్రతిపాదనపై ఎలాంటి అభ్యంతరాలు అందకుంటే అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో అజార్​ చేరనున్నారు.

మధ్యాహ్నం 3 గంటలకు గడువు ముగింపు

ప్రస్తుతానికి ఈ ప్రతిపాదన నిరభ్యంతర కాల వ్యవధిలో కొనసాగుతోంది. ప్రతిపాదనపై ఏమైనా అభ్యంతాలుంటే 10 రోజుల్లోగా స్పందించాలని గడువు ఇచ్చింది కమిటీ. నేడు 3 గంటలకు ఈ కాలవ్యవధి ముగియనుంది. కమిటీ సభ్యుల ఏకాభిప్రాయంతో తుదినిర్ణయం తీసుకోనున్నారు.

అందరి దృష్టి చైనా వైపే...

అజార్​ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలన్న అంశంపై ఇప్పుడు అందరి కళ్లు చైనా వైపే చూస్తున్నాయి. అజార్​ను ఈ జాబితాలో చేర్చాలన్న ఎన్నో ప్రతిపాదనలపై గతంలో చైనా అడ్డుతగిలింది. భద్రతా మండలిలో వీటో అధికారంతో చైనా ఇష్టారీతిన వ్యవహరించింది.

పదేళ్లలో నాలుగు సార్లు

మసూద్​ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలని ప్రతిపాదించటం గత పదేళ్లలో ఇది నాలుగోసారి. 2009, 2016, 2017లలో భారత్​... ఇతర దేశాలతో కలిసి అజార్​పై ఐరాసలో ప్రతిపాదనలు చేసింది. పుల్వామా ఉగ్రదాడిని ప్రపంచమంతా ఖండించిన నేపథ్యంలో ఈసారి చైనా.. ఈ ప్రతిపాదనకు మద్దతిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసింది అమెరికా.

ఆంక్షలు అమలైతే..

ఐరాస భద్రత మండలి ఆంక్షల జాబితాలోకి అజార్​ పేరు చేర్చితే అతని ఆస్తులను స్వాధీనం చేసుకుంటారు. ఉగ్రవాద కార్యకలాపాలకు ఎలాంటి నిధులందకుండా చేస్తారు. అంతర్జాతీయ ప్రయాణాలపై, ఆయుధాల వినియోగంపైనా నిషేధం అమల్లోకి వస్తుంది.

ABOUT THE AUTHOR

...view details