తెలంగాణ

telangana

ETV Bharat / international

Afghan Crisis: అమెరికా ఖర్చు ఘనం- ఫలితం మాత్రం... - అఫ్గానిస్థాన్​పై అమెరికా ఖర్చు

అఫ్గానిస్థాన్​ యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికా లక్ష కోట్ల డాలర్లను వెచ్చించిందని ది స్పెషల్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఫర్‌ అఫ్గానిస్థాన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ (సిగర్‌) రిపోర్టు తెలిపింది. చాలా ముఖ్యమైన సుమారు 10 ప్రాజెక్టులకు ఈ మొత్తాన్ని వృథాగా ఖర్చు చేసినట్లు ఈ నివేదికలో పేర్కొంది.

sigar report afghanistan
సిగర్‌ రిపోర్టు

By

Published : Aug 20, 2021, 4:18 PM IST

అఫ్గాన్‌ యుద్ధంలో అమెరికా సుమారు లక్ష కోట్ల డాలర్లను వెచ్చించింది. ఈ సొమ్ము పాకిస్థాన్‌ వార్షిక జీడీపీ కంటే కొన్ని రెట్లు ఎక్కువ. ఇంత సొమ్మును అఫ్గానిస్థాన్‌లో కుమ్మరించడంపై అమెరికా వాసులు గుర్రుగా ఉన్నారు. పోనీ.. ఇంత వెచ్చించినా అనుకున్న ఫలితం సాధించారా..? అంటే.. అది కూడా లేదు.. ఏ పరిస్థితుల్లో యుద్ధం మొదలు పెట్టారో.. అదే పరిస్థితులను పునరావృతం చేస్తూ అమెరికా దళాలు తిరుగుముఖం పట్టాయి. అఫ్గాన్‌లో చేపట్టిన పలు ప్రాజెక్టులు ఏ మాత్రం పనికిరావని ఇటీవల ది స్పెషల్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఫర్‌ అఫ్గానిస్థాన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ (సిగర్‌) రిపోర్టు పేర్కొంది. ఈ సంస్థను అమెరికా కాంగ్రెస్‌ 13ఏళ్ల క్రితం ఏర్పాటు చేసింది. అఫ్గాన్‌లో అమెరికా విజయాలు.. పరాజయాలను డాక్యుమెంటేషన్‌ చేస్తుంది. తాజాగా ఈ సంస్థ పత్రాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యమైన 10 వృథా ప్రాజెక్టులు తెల్లఏనుగుల వలే అమెరికా సొమ్మును విపరీతంగా తినేశాయని ఈ నివేదిక పేర్కొంది.

రూ.4 వేల కోట్లను.. రూ.23లక్షలుగా మార్చారు ఇలా..!

ఇటలీ తయారు చేసిన జీ222 ట్విన్‌ టర్బోప్రాప్‌ విమానాలను అఫ్గానిస్థాన్‌లో పునర్వినియోగానికి తెచ్చేందుకు 549 మిలియన్‌ డాలర్లను( సుమారు రూ.4వేల కోట్లు) ఖర్చు చేసింది. 20 విమానాలపై ఈ మొత్తం వెచ్చించగా వాటిల్లో 16 విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఎగరలేని పరిస్థితుల్లో కాబుల్‌ ఎయిర్‌పోర్టులో నిలిచిపోయాయి. ఆ తర్వాత వాటిని తుక్కు వ్యాపారులకు కేవలం 32 వేల డాలర్ల(సుమారు రూ. 23 లక్షలు)కు విక్రయించేసింది. ఈ విమాన వైఫల్యాలకు ఎవరినీ బాధ్యులను చేయలేమని సిగర్‌ నివేదికలో వెల్లడించింది.

నెల కూడా నిలవని రహదారి..!

అమెరికా ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ 176 మిలియన్‌ డాలర్లు వెచ్చించి గర్డేజ్‌ పట్టణం నుంచి కొహొస్ట్‌ ప్రావిన్స్‌కు 101 కిలోమీటర్ల రహదారిని నిర్మించింది. ఈ నిర్మాణం పూర్తి అయ్యాక తనిఖీ అధికారులు వెళ్లి చూడగా ఐదు చోట్ల పూర్తిగా ధ్వంసమైపోయింది. మరో రెండు చోట్ల రహదారి కొట్టుకుపోయింది. ఈ విషయాన్ని 2016 ఆడిట్‌లో వెల్లడించింది.

గుడ్‌ లుక్స్‌కు 28 మిలియన్‌ డాలర్లు..!

అఫ్గాన్‌ సైన్యం కోసం అమెరికా కామోఫ్లాజ్‌ యూనిఫామ్‌ను కొనుగోలు చేసింది. ఇందుకోసం 28 మిలియన్‌ డాలర్లను వెచ్చించింది. చుట్టూ వున్న పరిసరాల్లో కలిసిపోయి.. శత్రువు వెంటనే గుర్తించకుండా ఉండేందుకు కామోఫ్లాజ్‌ యూనిఫామ్‌ వాడతారు. అమెరికా కొనుగోలు చేసిన యూనిఫామ్‌ అఫ్గాన్‌ పరిసరాలకు ఏమాత్రం సరిపోలేదు. కేవలం అఫ్గాన్‌ రక్షణ మంత్రి ఈ యూనిఫామ్‌ చూడటానికి బాగుంది అనడంతో కొనుగోలు చేశారు.

కరిగిపోయే భనాలకు అర్ధమిలియన్‌ డాలర్లు..

లోగర్‌ ప్రావిన్స్‌లో అఫ్గాన్‌ స్పెషల్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ నిర్మాణం అవినీతికి నిదర్శనంగా నిలిచింది. ఈ నిర్మాణ పనిని ఓ అఫ్గాన్‌ కాంట్రాక్టర్‌కు అప్పజెప్పారు. ఒక సంక్లిష్టమైన అఫ్గాన్‌ గ్రామాన్ని తలపించేలా దీనిని నిర్మించాలని సూచించారు. ఇక్కడ సెర్చ్‌ అండ్‌ క్లియరెన్స్‌ ఆపరేషన్స్‌ సాధన చేయాలని భావించారు. తీరా భవనం నిర్మించి అమెరికా సేనలు స్వాధీనం చేసుకొన్నాక దాని నాణ్యతా లోపాలు బయటపడ్డాయి. నాలుగు నెలలకే వీటి గోడల్లోకి చెమ్మ వచ్చింది. దీంతో అమెరికా అధికారులు పరిశీలించగా.. నిర్మాణానికి వాడిన ఇటుకలో ఇసుకను అత్యధికంగా వినియోగించినట్లు తేలింది. 2015లోని అమెరికా ఆడిట్‌ రిపోర్టులో ఈ నిర్మాణాన్ని 'కరిగిపోయే భవనాలు'గా అభివర్ణించడం గమనార్హం.

నల్లమందుపై వృథాగా యుద్ధం..!

అఫ్గాన్‌లో నల్లమందు పంటను తుడిచి పెట్టేందుకు అమెరికా దాదాపు 15ఏళ్లు యుద్ధం చేసింది. నల్లమందు అక్రమ రవాణ నుంచి ఉగ్రవాదులకు లభించే సొమ్మును అడ్డుకోవడమే దీని లక్ష్యం. ఈ సమయంలో దాదాపు 8.6 బిలియన్‌ డాలర్లను ఖర్చుపెట్టింది. కానీ, ఏమాత్రం ఫలితం లేదు. 2017 నాటికి నల్లమందు సాగు రికార్డు స్థాయికి పెరిగింది.

పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ వైఫల్యంతో..

పది లక్షల మంది అఫ్గాన్‌ వాసులకు విద్యుత్తు అందించేందుకు 116 మిలియన్‌ డాలర్లను అమెరికా సైన్యంలోని ఇంజినీర్స్‌ కోర్‌ వెచ్చించింది. ఈ క్రమంలో ఆ ప్రాజెక్టుపై వెచ్చించిన 60 మిలియన్‌ డాలర్ల నిధులు దుర్వినియోగం అయ్యాయి. ఇందులో నాసిరకమైన పరికరాలను వాడినట్లు సిగర్‌ గుర్తించింది.

ఖాళీ హెడ్‌క్వార్టర్స్‌..

హెల్మాండ్‌ ప్రావిన్స్‌లోని లెదర్‌నెక్‌లో 64వేల చదరపు అడుగుల్లో కమాండ్‌ కంట్రోల్‌ నిర్మాణానికి 36 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేసింది. ఇందులో 1500 మంది ఉద్యోగులు పనిచేయవచ్చు. అత్యంత నాణ్యతతో నిర్మించిన భవనం అని సిగర్‌ 2013 నివేదికలో పేర్కొంది. కానీ, అమెరికా సైన్యం మాత్రం దీనిని వాడలేదు.

అర్ధంతరంగా నిలిచిపోయిన హోటళ్ల నిర్మాణం..

ఓవర్సీస్‌ ప్రైవేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి 85 మిలియన్‌ డాలర్ల రుణం తీసుకొని 209 గదుల హోటల్‌,150 కాబుల్‌ గ్రాండ్‌ రెసిడెన్స్‌ అపార్ట్‌మెంట్‌ నిర్మాణం చేపట్టారు. ఇది అమెరికా దౌత్యకార్యాలయానికి దగ్గరగానే ఉంది. కానీ, 2016 నవంబర్‌ నుంచి వీటి నిర్మాణం ఆగిపోయింది. ఆ రుణాలు మొండి బకాయిలుగా మారాయి.

భోజనశాల లేదని..

అఫ్గాన్‌ నేషనల్‌ ఆర్మీ కోసం పెంటగాన్‌ 3.7 మిలియన్‌ డాలర్లు వెచ్చించి తుర్కెమెనిస్థాన్‌ సరిహద్దుల్లో ఓ క్యాంప్‌ ఆఫీస్‌ నిర్మించింది. పాక్షికంగా దీని నిర్మాణం కూడా పూర్తయింది. కానీ, దీనిని సైన్యం వాడుకోకుండా వదిలేసింది. ఇందులో భోజనాలు చేయడానికి వసతి లేదని పెంటగాన్‌ అధికారి ఒకరు వెల్లడించారు.

బూడిదలో పోసిన పన్నీరుగా సైనిక శిక్షణ ఖర్చు..

అఫ్గానిస్థాన్‌ సైన్యానికి శిక్షణ నిమిత్తం 20 ఏళ్లలో 83 బిలియన్‌ డాలర్లను వెచ్చించారు. కానీ, తాలిబన్లు ఆక్రమణ మొదలు పెట్టాక కనీస ప్రతిఘటన కూడా ఇవ్వకుండా అఫ్గాన్‌ సైన్యం లొంగిపోయింది. అమెరికా సైన్యం ఈ పరిణామాలతో అవాక్కైంది. అఫ్గాన్‌ సైన్యం పతనంపై అమెరికాకు ముందే అంచనాలున్నాయని వార్తలొచ్చాయి. కానీ, అమెరికా ఛైర్మన్‌ ఆఫ్‌ జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జనరల్‌ మార్క్‌ మిల్లీ మాట్లాడుతూ '3 లక్షల మంది ఉన్న అఫ్గాన్‌ సైన్యం 11 రోజుల్లో కుప్పకూలుతుందని నాకు తెలుసు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు' అని పేర్కొన్నారు. అంతేకాదు పదుల సంఖ్యలో విమానాలు, హెలికాప్టర్లు, వందల టన్నుల ఆయుధాలు, మందు గుండు తాలిబన్ల పాలైంది.

ఇదీ చూడండి:అతడి కోసం తాలిబన్ల కళ్లుగప్పి అమెరికా రెస్క్యూ ఆపరేషన్​

ABOUT THE AUTHOR

...view details