సముద్రంలో మునిగిపోయిన తమ జలాంతర్గామిని గుర్తించేందుకు ఇండోనేసియా నావికాదళం గాలింపు ముమ్మరం చేసింది. ఐదు నౌకలు, ఓ హెలికాప్టర్ సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు తెలిపింది. సముద్రాల్లో గాలింపు కోసం ఉపయోగించే అధునాతన సాంకేతికత ఉన్న ఓ సర్వే నౌకను రంగంలోకి దించుతున్నట్లు వెల్లడించింది. 600-700 మీటర్ల లోతుకు జలాంతర్గామి పడిపోయి ఉంటుందని నావికాదళం భావిస్తోంది.
కాగా.. జలాంతర్గామి గల్లంతైన ప్రాంతానికి 2.5 నాట్స్ దూరంలో నీటి కదలికలను గుర్తించినట్లు ఇండోనేసియా ఆర్మీ తెలిపింది. అయితే, అది సబ్‌మెరైనే అని నిర్ధరించేందుకు తగిన డేటా అందుబాటులో లేదని ఆర్మీ ప్రతినిధి అచ్మద్ రియాద్ పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో చమురు ఆనవాళ్లు, డీజిల్ వాసనను పలు నౌకలు గుర్తించాయని చెప్పారు. అయితే అది సబ్‌మెరైన్ ఇంధనమే అని చెప్పేందుకు ఆధారాలు లేవని అన్నారు.
భారత్ సహాయం
సరిహద్దు దేశాలు ఈ సెర్చ్ ఆపరేషన్‌కు సహకరిస్తున్నాయి. పలు దేశాలు తమ నౌకలను పంపిస్తున్నాయి. భారత్ సైతం ఇండోనేసియాకు అండగా నిలబడింది. జలాంతర్గామిని గుర్తించేందుకు డీప్ సబ్‌మెరైన్ రెస్క్యూ నౌకను రంగంలోకి దించింది. విశాఖపట్నం నుంచి ఈ నౌక బయలుదేరిందని భారత నావికా దళం ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో ఉన్న అధునాతన సాంకేతికత.. గల్లంతైన జలాంతర్గాములను గుర్తిస్తుందని పేర్కొంది.
సింగపూర్, మలేసియా దేశాల నౌకలు శనివారం నాటికి ఇక్కడికి రానున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, టర్కీ దేశాలు సహాయం చేసేందుకు ముందుకొచ్చాయని ఇండోనేసియా నావికా దళం స్పష్టం చేసింది.