అఫ్గాన్‌లో హింస నిత్యకృత్యం అయిపోయింది. ఎంతలా అంటే అక్కడ ప్రజలు శాంతి అనే పదం ఒకటి ఉందా! అనేంతలా. అక్కడి పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి(ఐరాస) అసహనం వ్యక్తం చేసింది. తాలిబన్లు, అఫ్గానిస్థాన్ భద్రత దళాల పోరు ఫలితంగా సామాన్య ప్రజల మరణాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది ఐరాస. అఫ్గాన్‌లో హింసను తక్షణమే అరికట్టాలని పిలుపునిచ్చింది.
వారి చేసిన పనే..
గత వారం అఫ్గానిస్థాన్‌లోని ఓ ప్రసూతి ఆస్పత్రిపై భయంకరమైన దాడులు జరిగాయి. ఇందులో 24 మంది మృతి చెందారు. వారిలో ఇద్దరు పసిబిడ్డలూ ఉన్నారు. దీనికి కారణం ఎవరన్నది ఇప్పటికీ తెలియలేదు. అయితే కాబుల్ పరిసర ప్రాంతాల్లోని మైనారిటీ వర్గం షియాలను లక్ష్యంగా చేసుకొని.. అఫ్గాన్ ఇస్లామిక్ స్టేట్ తరచు దాడులు చేస్తోందని అమెరికా ఆరోపించింది. ఆస్పత్రిపై దాడి వారి పనేనని అనుమానం వ్యక్తం చేసింది అగ్రరాజ్యం.
ఇదీ చూడండి: శాంతి ఒప్పందమే అఫ్గాన్ పాలిట శాపమా?
దాడులను ఖండించిన తాలిబన్
ప్రసూతి దాడుల్లో తమ ప్రమేయం లేదని తాలిబన్లు ఖండించారు. దేశ విద్రోహశక్తులైన ఉగ్రమూకలను అణిచివేసే క్రమంలో జరిగిన కాల్పుల్లో పౌరులు మృతి చెందారు. సామాన్య పౌరులు తమ లక్ష్యం కాదని అఫ్గాన్ భద్రత దళాలు స్పష్టం చేశాయి. అయితే తాలిబన్ల దాడుల్లో 208 మంది పౌరులు మరణించగా.. అఫ్గాన్ భద్రత దళాల ఎదురుకాల్పుల ఫలితంగా 172 మంది చనిపోయినట్లు ఐరాస నివేదిక విడుదల చేసింది.
" దేశంలో శాంతి కోసం తాలిబన్- అఫ్గాన్ కట్టుబడి ఉండాలి. ప్రజల ప్రాణాలను రక్షించాలి. యుద్ధాన్ని అంతం చేయాలన్న ప్రజల ఆశను దెబ్బతీయకూడదు. దేశంలో సాధ్యమైనంత త్వరలో శాంతి చర్చలు జరగాల్సిన అవసరం ఉంది."
-డెబోరా లయన్స్, అఫ్గాన్ తరఫున ఐరాస ప్రత్యేక ప్రతినిధి
అమెరికా అదే కోరుకుంటోంది!
అఫ్గాన్‌లో హింసను అంతం చేయాలని అమెరికా కూడా పిలుపునిచ్చింది. అగ్రరాజ్యం ప్రత్యేక శాంతి ప్రతినిధి ఖలీజాద్.. తాలిబన్లతో మరోసారి చర్చలు జరపాలని కోరింది అగ్రరాజ్యం. హింసను వెంటనే తగ్గించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
ఇదీ చూడండి:కరోనాను పసిగట్టే సూపర్ స్మార్ట్ 'మాస్క్'