అంతర్జాతీయ సమాజాన్ని ఏకం చేసి, మయన్మార్‌లో సైనిక తిరుగుబాటును తిప్పికొట్టేందుకు ఐరాస ఏదైనా చేస్తుందని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ స్పష్టం చేశారు. మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలన్న భద్రతా మండలి పిలుపును అమలు చేయడం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. నవంబర్‌లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను గౌరవించి.. నిర్బంధంలో ఉంచిన నేతలందరినీ విడుదల చేయాలని సైన్యానికి హితవు పలికారు.
తొలిసారి..
మయన్మార్ ఐరాస ప్రత్యేక ప్రతినిధి క్రిస్టీన్ ష్రానర్ బర్గెనర్తో శుక్రవారం ఆ దేశ సైన్యం తొలిసారి సంప్రదింపులు జరిపిందని గుటెరస్ ప్రతినిధి స్టీఫెన్ డుజరిక్ తెలిపారు. సైనిక చర్యను ఐరాస తీవ్రంగా ఖండించినట్లు మయన్మార్ కమాండర్ ఇన్ ఛీఫ్ సో విన్‌కు స్పష్టం చేసినట్లు వెల్లడించారు.
"నిర్బంధంలో ఉంచినవారిని వెంటనే విడుదల చేయాలని ష్రానర్ బర్గెనర్ ఆ దేశ సైనికాధికారులకు స్పష్టం చేశారు. రోహింగ్యా శరణార్థులు తిరిగి స్వదేశానికి చేరుకునే ప్రక్రియ పురోగతి సాధించాలని, ఇందుకోసం ముఖ్యమైన చర్చలు ప్రారంభించాలని పేర్కొన్నారు."
-స్టీఫెన్ డుజరిక్, గుటెరస్ ప్రతినిధి