Bus for sleeping: రోజంతా ఎంతో కష్టపడతాం.. అలసిసొలసి రాత్రి హాయిగా నిద్రకు ఉపక్రమించేస్తాం. కానీ.. కొంతమందికి అస్సలు నిద్ర పట్టదు. అదే బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో అయితే.. వద్దన్నా నిద్ర కమ్ముకొచ్చేస్తుంది. చల్లగాలికి, బస్సు వేగానికి చక్కగా కునుకు తీయొచ్చు.
Sleeping bus tour:
ఈ విషయాన్ని గుర్తించిన హాంకాంగ్‌లోని ఉలూ ట్రావెల్స్ అనే సంస్థ 'స్లీపింగ్ బస్ టూర్' పేరుతో వినూత్న సేవల్ని ప్రవేశపెట్టింది. ఇంట్లో పడకపై నిద్ర పట్టని వారు, నిద్రలేమితో బాధపడేవారు తమ బస్సులో ప్రయాణిస్తూ ఐదు గంటలపాటు నిద్రపోవచ్చని తెలిపింది. హాంకాంగ్ పరిధిలో తమ డబుల్ డెక్కర్ బస్ 5 గంటలపాటు 52 మైళ్ల మేర(దాదాపు 83 కి.మీ.) గమ్యం లేకుండా తిరుగుతుందని.. చివరకు ఎక్కిన చోటే దించేస్తుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
- టికెట్ ధర సీటు ఎంపికను బట్టి ఉంటుంది. లోయర్ డెక్‌లో అయితే.. 12 డాలర్లు, అప్పర్ డెక్‌లో 51 డాలర్ల చొప్పున వసూలు చేస్తారు.
- ప్రయాణికులకు కళ్లకు పెట్టుకునే మాస్క్, బయటి శబ్దాలు వినిపించకుండా చెవులకు ఇయర్ ప్లగ్స్‌ను ఇస్తారు.
- ఈ టూర్లో భాగంగా.. ప్రకృతి అందాలను, పర్యటక ప్రదేశాలను కూడా చుట్టేయొచ్చు.
ఈ ప్రయత్నానికి.. ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని ఉలూ ట్రావెల్స్ యజమాని ఫ్రాంకీ చౌ చెప్పుకొచ్చారు. ట్రాఫిక్ ఎక్కువగా లేని చోట, ప్రయాణికుల నిద్రకు ఆటంకం కలగకుండా ఓ ఉత్తమ మార్గాన్ని తాను సృష్టించినట్లు వెల్లడించారు.
''రెండు వర్గాల ప్రయాణికుల కోసం ఈ సదుపాయం తీసుకొచ్చాం. మొదటిది.. నిద్రలేమితో బాధపడేవారు. రెండోది.. నిద్రించడానికి మంచి స్పాట్ కోసం ఎదురుచూసేవారు. ఇంకా రవాణా ఆంక్షల నడుమ.. పర్యటక ప్రదేశాలను చూసేందుకు ఇష్టపడేవారికి ఇది ఉపయోగకరం.''
- ఫ్రాంకీ చౌ, ఉలూ ట్రావెల్ అధ్యక్షుడు
చక్కటి అనుభూతి..
పని ఒత్తిడిలో హాంకాంగ్‌లో చాలా మందికి సరిగా నిద్ర ఉండదని, అసలు ప్రయాణం చేయడానికే ఓపిక ఉండదని అంటున్నాడు ప్రయాణికుడు హో వై. కానీ.. బస్సులో నిద్ర ఏర్పాటు చేయడం.. చక్కటి అనుభవమని చెబుతున్నాడు.