Ukrainian Soldier: తాను పుట్టిన గడ్డపై పరాయి దేశం దాడి చేస్తుందంటే ఏ ఒక్కరూ తట్టుకోలేరు. ఇక వీర సైనికులు అయితే.. తమ ఎదురుగా ఉన్న శత్రువు బలమైనది అయినా సరే, ఎదురొడ్డి నిలుస్తారు. చివరకు ప్రాణత్యాగానికి వెనుకాడరు. ఉక్రెయిన్‌పై రష్యా పోరు వేళ.. అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. సమయం లేకపోవడంతో.. శత్రువుల రాకను అడ్డుకునేందుకు ఓ సైనికుడు తనను తానే పేల్చుకున్నాడు..! ఇప్పుడు ఆ అమరుడి త్యాగానికి అందరూ కన్నీళ్లతో అంజలి ఘటిస్తున్నారు.
మెరైన్ బెటాలియన్‌కు చెందిన ఇంజనీర్ వొలొదిమిరోవిచ్.. హినిచెస్క్ వారధి వద్ద విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆ సమయంలో రష్యా దళాలు క్రిమియా నుంచి ఉక్రెయిన్ ప్రధాన భూభాగంలోకి చొచ్చుకొస్తున్నాయి. అవి లోపలికి ప్రవేశిస్తే విధ్వంసం తప్పదని భావించిన అతడు.. అందుకు కీలకమైన వారధిని పేల్చివేయాలనుకున్నాడు. అందుకోసం వారధికి బాంబులు అమర్చాలనుకున్నాడు. కానీ ఈలోపే బలగాలు దూసుకువస్తున్నాయి. ఆ కొద్ది సమయంలో వాటిని ఎలా నిలువరించాలో అర్థం కాలేదు. క్షణకాలం పాటు ఆలోచించి.. ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఆ బాంబుల్ని తనకే అమర్చుకొని.. తనతో పాటు వారధి కూడా పేలేలా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన నిర్ణయాన్ని అమలు చేశాడు. వారధితో పాటు తనూ తునాతునకలై పోయాడు. ఆ సైనికుడి సాహసం.. రష్యన్ సేనల దూకుడును గణనీయంగా తగ్గించగలిగిందని అతడి సహచరులు ప్రశంసించారు. కానీ కళ్లఎదుటే తమ సహచరుడిని కోల్పోవడం వారిని తీవ్రంగా బాధించింది.