Ukraine War: ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యాపై ఆంక్షల పర్వం కొనసాగుతున్న వేళ మాస్కో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు దిగ్గజ సంస్థలు రష్యాలోని తమ ఉత్పత్తులు, సేవలపై ఆంక్షలు విధించాయి. అయితే ఇప్పుడు రష్యా కూడా అటువంటి చర్యలే తీసుకుంది. ట్విట్టర్, ఫేస్‌బుక్, బీబీసీ, యాప్ స్టోర్ సేవల్ని బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఓ పాత్రికేయుడు ట్వీట్ చేశారు. రష్యా సైనికపోరుపై ఉక్రెయిన్ సహా ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న సమాచారానికి అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు.
ఫేస్‌బుక్, ట్విట్టర్, యాప్ స్టోర్ అమెరికాకు చెందిన సంస్థలు కాగా.. బీబీసీ బ్రిటన్‌కు చెందింది. ఈ యాప్‌లపై ఆంక్షలు విధించడమంటే అమెరికా, బ్రిటన్‌తో రష్యా అంతర్జాల పోరుకు దిగినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక సైనిక చర్యతో దూకుడుగా ముందుకు వెళ్తున్న రష్యాను అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రష్యన్ స్టేట్ మీడియా తమ ప్లాట్‌ఫామ్‌లలో ఆదాయాన్ని ఆర్జించకుండా ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా, గూగుల్, యూట్యూబ్‌లు నిషేధం విధించాయి.