Ukraine war: ఉక్రెయిన్‌లో ఉన్న వారిని తరలించడం ఇప్పుడు అంత సురక్షితం కాదని ఆ దేశంలో ఉన్న తమ పౌరులకు చైనా రాయబారి ఫ్యాన్ షియాన్‌రాంగ్ తెలిపారు. పరిస్థితులు చక్కబడే వరకు వేచి ఉండాలని కోరారు. ఈ మేరకు వీచాట్‌లో ఓ సుదీర్ఘ వీడియోను ఆదివారం పోస్ట్ చేశారు. తాను ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను వదిలి వెళ్లానని.. చైనీయులు అక్కడే చిక్కుకుపోయారని ఆన్‌లైన్‌లో వస్తున్న వార్తల్ని ఫ్యాన్ తిప్పికొట్టారు.
ప్రతిఒక్కరి భద్రతకు హామీ లభించే వరకూ ఎవరినీ తరలించలేమని ఫ్యాన్ వీడియోలో స్పష్టం చేశారు. అప్పటి వరకు ఓపిగ్గా వేచి ఉండాల్సిందేనన్నారు. స్థానికులతో గొడవలకు దిగొద్దని విజ్ఞప్తి చేశారు. పలు ప్రాంతాల్లో చైనీయులు, ఉక్రెనియన్లకు మధ్య ఘర్షణలు తలెత్తాయని సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. ప్రస్తుతం ఉక్రెనియన్లు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారని.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారి భావోద్వేగాల్ని అర్థం చేసుకోవాలన్నారు. వారిని రెచ్చగొట్టే ప్రయత్నాలేమీ చేయొద్దన్నారు. దేశంలో ఎక్కడ చూసినా.. బాంబుల మోతలు, సైరన్ల కూతలే వినిపిస్తున్నాయన్నారు. నేలమాళిగల్లో దాచుకోవాల్సి వస్తోందన్నారు. ఈ తరహా పరిస్థితులు మనమంతా గతంలో సినిమాల్లోనే చూసి ఉంటామని ఫ్యాన్ వ్యాఖ్యానించారు.