తెలంగాణ

telangana

ETV Bharat / international

హైపర్‌సోనిక్‌ ఎందుకింత డేంజర్​.. భారత్​లో ఈ మిసైల్ ఉందా? - kinzhal hypersonic missile

Ukraine Russia war: ఉక్రెయిన్‌పై దాడుల్లో తొలిసారిగా కింజాల్​ హైపర్‌సోనిక్ మిసైల్​ను వాడింది రష్యా. ఈ క్షిపణితో ఉక్రెయిన్​లోని ఆయుధ నిల్వల కేంద్రాన్ని ధ్వంసం చేసింది. ఈ ఘటనతో హైపర్​సోనిక్ మిసైల్​పై ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా చర్చ మొదలైంది. ఇంతకీ హైపర్​సోనిక్ అంటే ఏమిటి? ఈ అస్త్రం భారత్​లో ఉందా?

Ukraine Russia war
hypersonic missile russia

By

Published : Mar 20, 2022, 5:48 AM IST

Ukraine Russia war: ఉక్రెయిన్‌ యుద్ధంలో తొలిసారిగా ఒక భీకర అస్త్రాన్ని రష్యా ప్రయోగించింది. అధ్యక్షుడు పుతిన్‌కు 'ప్రీతిపాత్రమైన' ఈ హైపర్‌సోనిక్‌ క్షిపణి 'కింజాల్‌' ద్వారా నేలమాళిగలోని ఒక భారీ ఆయుధగారాన్ని ధ్వంసం చేసింది. ధ్వని కన్నా 10 రెట్లు వేగంతో దూసుకెళ్లే ఈ అస్త్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

.

ఏమిటీ కింజాల్‌?

  • కింజాల్‌ అంటే రష్యన్‌ భాషలో పిడి బాకు అని అర్థం. ఇది యుద్ధవిమానాల నుంచి ప్రయోగించే హైపర్‌సోనిక్‌ క్షిపణి.
  • ప్రయోగించిన వెంటనే గంటకు ఇది 4,900 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అనంతరం గరిష్ఠంగా 12,350 కిలోమీటర్ల వేగాన్ని సాధిస్తుంది.
  • ఇది 480 కిలోల అణు పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. అంటే.. హిరోషిమాపై వేసిన బాంబు కన్నా 33 రెట్లు శక్తిమంతమైన విస్ఫోటాన్ని కలిగించే అణ్వస్త్రాన్ని మోసుకెళ్లగలదు.
    .

బోల్తా కొట్టిస్తూ..

శత్రు భూభాగంలోని విలువైన లక్ష్యాల ధ్వంసానికి కింజాల్‌ని ప్రయోగిస్తారు. ప్రత్యర్థి గగనతల రక్షణ వ్యవస్థను ఇది బోల్తా కొట్టిస్తుంది. ఈ క్షిపణి వేగం, మార్గమధ్యంలో అది చేసే విన్యాసాల కారణంగా ఆ అస్త్రాన్ని గాల్లో అడ్డుకోవడం చాలా కష్టం. ప్రధానంగా 'నాటో' కూటమి యుద్ధనౌకలు, క్షిపణి రక్షణ వ్యవస్థలను నాశనం చేసేందుకు రష్యా దీన్ని అభివృద్ధి చేసింది.

హైపర్‌సోనిక్‌ అంటే..?

ధ్వని వేగం గంటకు 1,234 కిలోమీటర్లు. దీన్ని మించిన వేగాన్ని సూపర్‌సోనిక్‌ అంటారు. ధ్వని కన్నా 5 రెట్లు వేగంతో ప్రయాణించే క్షిపణిని హైపర్‌సోనిక్‌ అస్త్రంగా పేర్కొంటారు. ఇవి గంటకు 6,000 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించగలవు.

  • బాలిస్టిక్‌ క్షిపణుల తరహాలో ఇవి నిర్దిష్ట, ఆర్చి ఆకృతిలో ఉన్న మార్గంలో ప్రయాణించవు. లక్ష్యాన్ని చేరే వరకూ అలవోకగా అనేక విన్యాసాలు చేసుకుంటూ వెళతాయి.
  • హైపర్‌సోనిక్‌ వేగం వల్ల క్షిపణి ముందుభాగంలో గాలి అణువులు పెను మార్పులకు లోనవుతాయి. దీన్ని అయనైజేషన్‌ అంటారు. దీనివల్ల హైపర్‌సోనిక్‌ అస్త్రంపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. అందువల్ల దీని తయారీకి ప్రత్యేక లోహాలను ఉపయోగించాలి.
  • ఈ క్షిపణుల్లోని స్క్రామ్‌జెట్‌ ఇంజిన్లు గాల్లో నుంచి ఆక్సిజన్‌ను తీసుకొని పనిచేస్తాయి.
    .

తొలి ప్రయోగం ఎప్పుడు?

కింజాల్‌ను 2018 మార్చిలో పుతిన్‌ ఆవిష్కరించారు. దీన్ని సమర్థ అస్త్రంగా ఆయన అభివర్ణించారు. అయితే 2016లోనే దీన్ని సిరియాపై ప్రయోగించినట్లు ఆరోపణలున్నాయి.

  • ఉక్రెయిన్‌పై దండయాత్రకు ముందు కింజాల్‌ అస్త్రాలను.. బాల్టిక్‌ సముద్ర ప్రాంతంలోని కాలినిన్‌గ్రాడ్‌ వద్దకు రష్యా తరలించింది. తాజా ప్రయోగానికి ఈ స్థావరం నుంచే క్షిపణిని తరలించినట్లు భావిస్తున్నారు.

'హైపర్‌' అస్త్రాలు ఎవరి వద్ద ఉన్నాయి?

అమెరికా, రష్యా, చైనా వద్ద అధునాతన హైపర్‌సోనిక్‌ అస్త్రాలు ఉన్నాయి. భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఉత్తర కొరియా వీటిని అభివృద్ధి చేస్తున్నాయి.

  • రష్యా వద్ద జిర్కాన్‌, అవన్‌గార్డ్‌ హైపర్‌సోనిక్‌ క్షిపణులూ ఉన్నాయి.
  • భారత్‌ గత ఏడాది తన హైపర్‌సోనిక్‌ టెక్నాలజీ డెమోన్‌స్ట్రేటర్‌ వెహికల్‌ని తొలిసారిగా విజయవంతంగా పరీక్షించింది. దీనిద్వారా హైపర్‌ అస్త్రానికి అవసరమైన ప్రాథమిక పరిజ్ఞానాలను పరిశీలించింది. 4-5 ఏళ్లలో ఇది పూర్తిస్థాయిలో సిద్ధమయ్యే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:ఉక్రెయిన్​పై సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించిన రష్యా!

ABOUT THE AUTHOR

...view details