తెలంగాణ

telangana

ETV Bharat / international

Ukraine russia news: 'మేం యుద్ధాన్ని కోరుకోవడంలేదు'

Ukraine russia news: తాము యుద్ధాన్ని కోరుకోవడంలేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్పష్టంచేశారు. అమెరికా, నాటో కూటమితో చర్చలకు సిద్ధమన్నారు. ఉద్రిక్తతలను చల్లార్చేందుకు దౌత్య ప్రయత్నాల్లో భాగంగా మంగళవారం మాస్కో వచ్చిన జర్మన్‌ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌తో చర్చల అనంతరం ఆయన మాట్లాడారు. నాటో కూటమిలో చేరాలన్న ఉక్రెయిన్‌ ప్రయత్నాలపై ‘శాంతియుత చర్చల’ను కోరుకుంటున్నట్లు చెప్పారు.

Putin, Russia
రష్యా, పుతిన్

By

Published : Feb 16, 2022, 6:46 AM IST

Ukraine russia news: ఉక్రెయిన్‌ అంశంపై కొన్ని వారాల ఉద్రిక్తతల తర్వాత ఎట్టకేలకు శాంతి ఆశలు చిగురిస్తున్నాయి. తాము యుద్ధాన్ని కోరుకోవడంలేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్పష్టంచేశారు. అమెరికా, నాటో కూటమితో చర్చలకు సిద్ధమన్నారు. ఉద్రిక్తతలను చల్లార్చేందుకు దౌత్య ప్రయత్నాల్లో భాగంగా మంగళవారం మాస్కో వచ్చిన జర్మన్‌ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌తో చర్చల అనంతరం ఆయన మాట్లాడారు. నాటో కూటమిలో చేరాలన్న ఉక్రెయిన్‌ ప్రయత్నాలపై 'శాంతియుత చర్చల'ను కోరుకుంటున్నట్లు చెప్పారు. అంతకుముందు సరిహద్దుల్లో సైనిక విన్యాసాల్లో పాల్గొన్న తమ బలగాలను పాక్షికంగా ఉపసంహరించుకుంటున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఈ దళాలు ఎక్కడి నుంచి వెనుతిరుగుతున్నాయి.. ఎంత మంది సైనికులు వెనక్కి వచ్చేస్తున్నారన్న వివరాలను వెల్లడించలేదు. అయితే ఈ ప్రకటనను పశ్చిమ దేశాలు విశ్వసించడంలేదు. పుతిన్‌ సేనలు ఉక్రెయిన్‌పై ఎప్పుడైనా దాడి చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. బుధవారమే అది జరగొచ్చని తెలిపాయి. రష్యా బలగాల ఉపసంహరణపై ఇప్పటివరకూ ఆధారాలేమీ లేవని నాటో అధిపతి చెప్పారు.

మా డిమాండ్లను నెరవేర్చాలి: పుతిన్‌

తమ ప్రధాన డిమాండ్లను తోసిపుచ్చినప్పటికీ, తాము ప్రతిపాదించిన అనేక భద్రత చర్యలపై చర్చలకు పశ్చిమ దేశాలు అంగీకరించాయని పుతిన్‌ తెలిపారు. ఐరోపాలో మధ్యంతరశ్రేణి క్షిపణుల మోహరింపుపై పరిమితులు, సైనిక విన్యాసాల్లో పారదర్శకత, విశ్వాసం పాదుగొల్పే చర్యలపై చర్చలకు తాము సిద్ధమన్నారు. అయితే తమ ప్రధాన డిమాండ్లనూ పశ్చిమ దేశాలు నెరవేర్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఐరోపాలో యుద్ధానికి అవకాశం ఉందా అన్న ప్రశ్నకు.. 'మేం దాన్ని కోరుకోవడంలేదు' అని బదులిచ్చారు. నాటో కూటమిలో చేరాలన్న ఉక్రెయిన్‌ ప్రయత్నం భద్రతపరంగా తమకు పెద్ద ముప్పు అని చెప్పారు. ఇప్పుడప్పుడే తమ కూటమిలో ఉక్రెయిన్‌ చేరబోదన్న పశ్చిమ దేశాల హామీలు తమకు భరోసా కలిగించబోవన్నారు.

షెడ్యూల్‌ ప్రకారమే..

సరిహద్దుల నుంచి సైన్యాన్ని కొంతమేర ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన రష్యా రక్షణశాఖ.. ట్యాంకులు, సాయుధ శకటాలను రైలులోకి ఎక్కిస్తున్న చిత్రాలను విడుదల చేసింది. ఈ ఫొటోలు ఎక్కడ తీశారన్నది వెల్లడి చేయలేదు. ప్రణాళిక మేరకే బలగాలు తిరిగొచ్చేస్తున్నాయని రష్యా విదేశాంగ మంత్రి లవ్రోవ్‌ చెప్పారు. 'దీనిపై ఎవరెంతగా యాగీ చేసి, 'సమాచార ఉగ్రవాదాని'కి పాల్పడినా మా సైనిక విన్యాసాలు నిర్దేశిత షెడ్యూల్‌కు కట్టుబడ్డాయి' అని తెలిపారు. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌.. లవ్రోవ్‌తో ఫోన్‌లో చర్చించారు. బలగాలను ఉపసంహరిస్తున్నామన్న రష్యా ప్రకటన నేపథ్యంలో తాజా పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ అధికారులు తెలిపారు.

నమ్మలేం..

రష్యా తాజా ప్రకటనపై ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా పెదవి విరిచారు. కళ్లతో చూస్తేగానీ దీన్ని తాము నమ్మలేమన్నారు. ఉద్రిక్తతలు సడలుతున్న సంకేతాలు గానీ, ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యా బలగాలు వెనుదిరుగుతున్న ఆనవాళ్లు గానీ ఎక్కడా కనిపించలేదని నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్‌ అంశంపై ఉద్రిక్తతలు చల్లార్చేందుకు సోమ, మంగళవారాల్లో విస్తృతంగా దౌత్య ప్రయత్నాలు జరిగాయి.

వెనక్కి వచ్చేయాలి: భారత్‌

ఉక్రెయిన్‌లో ఉంటున్న భారతీయులు.. ముఖ్యంగా బస తప్పనిసరి కాని విద్యార్థులు తాత్కాలికంగా తక్షణం స్వదేశం తిరిగిరావాలని భారత్‌ సూచించింది. ఈ మేరకు కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్‌కు అనవసర ప్రయాణాలు కూడా మానుకోవాలని అందులో తెలిపింది.

  • నిర్మాణాత్మక చర్చలకు రష్యా సిద్ధపడితే దౌత్యానికి మార్గం ఇంకా అందుబాటులోనే ఉందని వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి కేరిన్‌ జీన్‌ పియర్‌ తెలిపారు. తమ అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ అంశంపై బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌తో ఫోన్‌లో మాట్లాడారని పేర్కొన్నారు.
  • రష్యా దురాక్రమణ ముప్పు ఇంకా కొనసాగుతోందని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ మంగళవారం పేర్కొన్నారు. ఫిబ్రవరి ద్వితీయార్ధంలో రష్యా బలగాలు సైనిక చర్యకు దిగొచ్చని ఎస్టోనియా గూఢచర్య సంస్థ పేర్కొంది.
  • దాడి కోసం ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యా సైన్యం ఏర్పాట్లను కొనసాగిస్తోందని అమెరికా రక్షణ శాఖ అధికారులు అంతకుముందు తెలిపారు. భూతల దళాలు.. చిన్నచిన్న బృందాలుగా విడిపోయి ఉక్రెయిన్‌ సరిహద్దుకు చేరువలోని ప్రాంతాలకు వెళుతున్నట్లు పేర్కొన్నారు.
  • బెలారస్‌, క్రిమియా, పశ్చిమ రష్యాలో పుతిన్‌ సేనల కార్యకలాపాలు పెరిగాయని ఉపగ్రహ చిత్రీకరణ సంస్థ మాక్సర్‌ టెక్నాలజీస్‌ తెలిపింది. హెలికాప్టర్లు, యుద్ధవిమానాలు వచ్చాయని పేర్కొంది. గడిచిన 48 గంటల్లో తీసిన ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తే.. పోరాట దళాలు సైనిక స్థావరాల నుంచి బయటకు వచ్చి, వాహనశ్రేణిలా కదులుతున్నాయని తెలిపాయి.
  • బుధవారం జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పాటించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీ తెలిపారు. ఈ సందర్భంగా పౌరులు జాతీయ జెండాను ప్రదర్శిస్తూ, జాతీయ గీతాన్ని ఆలపించాలని కోరారు. రష్యా తమ దేశంపై దురాక్రమణకు పాల్పడుతుందన్న వార్తలను ఉక్రెయిన్‌ భద్రత మండలి అధిపతి ఒలెక్సీ డానిలోవ్‌ తేలిగ్గా తీసుకున్నారు. అయితే కొన్ని శక్తుల వల్ల అంతర్గత అస్థిరత తలెత్తవచ్చన్నారు.
  • తూర్పు ఉక్రెయిన్‌లో తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తించాలని రష్యా పార్లమెంటు సభ్యులు పుతిన్‌ను కోరారు.

ఉక్రెయిన్‌పై సైబర్‌ దాడి

ఉక్రెయిన్‌ ప్రభుత్వ సంస్థలు, ప్రధాన బ్యాంకులు లక్ష్యంగా మంగళవారం సైబర్‌ దాడి జరిగింది. ఫలితంగా కనీసం పది వెబ్‌సైట్లు మొరాయించాయి. ఇందులో రక్షణ, విదేశీ, సాంస్కృతిక శాఖలకు సంబంధించినవీ ఉన్నాయి. రెండు ప్రధాన ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఆన్‌లైన్‌ చెల్లింపులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. డిపాజిట్‌దారుల డబ్బుకు ఎలాంటి ఇబ్బంది లేదని ప్రభుత్వం తెలిపింది. రష్యాతో ఉద్రిక్తతల నేపథ్యంలో కొంతకాలంగా ఉక్రెయిన్‌పై సైబర్‌ దాడులు జరుగుతున్నాయి.

ఇదీ చూడండి:

శాంతి బాటలో రష్యా .. ఉక్రెయిన్ సరిహద్దు నుంచి సైన్యం వెనక్కి!

ABOUT THE AUTHOR

...view details