Ukraine Invasion: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఒత్తిడి పెంచుతూ అనేక దేశాలు రకరకాల ఆంక్షలు విధిస్తున్నాయి. ఇందులో భాగంగా రష్యా విమానాలకు తమ గగనతలాలను మూసివేస్తున్నాయి. ఇలాంటి దేశాల జాబితాలో తాజాగా ఫ్రాన్స్, కెనడాలు చేరాయి. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ చర్యలను వ్యతిరేకిస్తూ ఐరోపా ఒకేతాటిపైకి వస్తున్నట్లు ఫ్రెంచి రవాణా మంత్రి జీన్-బాప్టిస్ట్ జెబారీ పేర్కొన్నారు. భద్రత కారణాల దృష్ట్యా రష్యా నుంచి విమానాల రాకపోకలను నిలిపివేసినట్లు ఎయిర్ ఫ్రాన్స్ మరో ప్రకటనలో తెలిపింది. రష్యా విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు కెనడా రవాణా మంత్రి ఒమర్ అల్‌ఘబ్రా ప్రకటించారు. కాగా ఇప్పటికే జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ, చెక్ రిపబ్లిక్, పోలండ్, స్లొవేనియా, ఇస్తోనియా, లాత్వియా, లిథువేనియా, రొమేనియా, లగ్జెంబర్గ్‌లు తమ గగన తలాలను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. దీనికి ప్రతీకారంగా రష్యా కూడా లిథువేనియా, లాత్వియా, ఇస్తోనియా, స్లొవేనియాలకు గగనతలాన్ని మూసివేసింది.
రష్యా విమానాలకు తమ గగన తలాలను మూసివేస్తున్నట్లు 27 దేశాల ఐరోపా యూనియన్ (ఈయూ) ఆదివారం ప్రకటించింది. ఉక్రెయిన్ కోసం ఆయుధాల కొనుగోలు, సరఫరాకు నిధులు కూడా అందించనున్నట్లు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వోన్‌డెర్ లెయేన్ ఆదివారం తెలిపారు. ఓ దేశం కోసం ఇలా చేయడం ఇదే తొలిసారని ఆమె చెప్పారు. రష్యాకు సంబంధించిన అన్ని విమానాలపైనా నిషేధం విధించే యోచన కూడా ఉన్నట్లు వెల్లడించారు. రష్యా అనుకూల మీడియాను కూడా నిషేధించనున్నట్లు తెలిపారు. రష్యాకు మద్దతిస్తున్న బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకోపైనా కొత్తగా ఆంక్షలు విధించేందుకు యోచిస్తున్నట్లు వెల్లడించారు.