Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా ఏడో రోజూ తన దాడులను కొనసాగిస్తోంది. ఓ వైపు సైనిక దళాలు ఆ దేశంపై విరుచుకుపడుతుండగా.. ఇంకోవైపు ఇతర దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఉక్రెయిన్‌కు బాసటగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడో ప్రపంచ యుద్ధం అంటూ సంభవిస్తే అణ్వాయుధాలతోనే జరుగుతుందని, అది విధ్వంసకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఉక్రెయిన్ అణ్వాస్త్రాలు సేకరించేందుకు రష్యా అంగీకరించబోదని లావ్రోవ్ పేర్కొన్నారు. ఆంక్షలు ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూనే.. రష్యా సాంస్కృతిక రంగాన్ని లక్ష్యం చేస్తారని ఊహించలేదన్నారు. రష్యా అథ్లెట్లు, విలేకరులపై ఆంక్షలు విధించడం సరికాదని పశ్చిమ దేశాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌తో రెండో విడత చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే, అమెరికా చెప్పినట్లు ఉక్రెయిన్ ఆడుతోందని ఆరోపించారు.
మరోవైపు రష్యానుద్దేశించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారీ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధ భూమిలో పై చేయి సాధించినప్పటికీ.. దీర్ఘకాలంలో భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని పుతిన్‌ను పరోక్షంగా హెచ్చరించారు. ఇంకోవైపు రష్యా తన దాడులను యథాతథంగా కొనసాగిస్తోంది. ఉక్రెయిన్ నగరాల్లో ఒకటైన ఖెర్సోన్‌ను దళాలను స్వాధీనం చేసుకున్నట్లు బుధవారం రష్యా దళాలు ప్రకటించాయి.
ఖర్కివ్‌లో 12గంటల కర్ఫ్యూ!