Ukraine Crisis: రష్యా పాలనలో ఒలిగార్క్‌ల శక్తే వేరు.. వారంతా రష్యా ఖనిజాలు, ఇంధనం వంటి వాటిని నియంత్రిస్తూ దేశాన్ని శాసిస్తుంటారు. వీరు పుతిన్‌కు అత్యంత సన్నిహితులే..! కానీ, వీరిలో ఓ ప్రత్యేకమైన ఒలిగార్క్ ఉన్నాడు.. అతడు చేతిలో ఇంధనం లేదు.. ఖనిజాలు లేవు.. కేవలం ఫుడ్ కాంట్రాక్టులు మాత్రమే ఉన్నాయి. ఇది కాకుండా మరో కీలక విభాగం ఇతని కనుసన్నల్లో ఉంది. అదే పుతిన్ ప్రైవేటు సైన్యం.. వాగ్నార్ ప్రైవేటు మిలటరీ కంపెనీ (పీఎంసీ)..! ఈ గ్రూపులో మొత్తం కిరాయి సైనికులే వుంటారు. వీరు రష్యాకు, పుతిన్‌కు విదేశాల్లో అవసరమైన లక్ష్యాలను సాధించడానికి రహస్యంగా పనిచేస్తారు. తాజాగా ఈ బృందానికి సంబంధించిన 400 మందిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హత్యకు పురమాయించినట్లు వార్తలొస్తున్నాయి.
ఆ వంట మనిషి ఎవరు..?
రష్యా అధ్యక్షుడు పుతిన్ పొలిటికల్ సర్కిల్లో యెవ్జెనీ ప్రిగోజిన్ అంటే తెలియని వారుండరు. అతన్ని 'పుతిన్స్ చెఫ్'గా వ్యవహరిస్తుంటారు. పుతిన్ ఆంతరంగికుల్లో ప్రిగోజిన్ ఒకరు. వీరిద్దరి పరిచయం, ఎదుగుదల చాలా నాటకీయంగా జరిగింది. 1980ల్లో దొంగతనం, దోపిడీ కేసుల్లో ప్రిగోజిన్ దాదాపు 9 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. ఆ తర్వాత హాట్‌డాగ్ విక్రయిస్తూ జీవించాడు. సోవియట్ పతనం తర్వాత సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో రెస్టారెంట్ స్థాపించాడు. 1990ల్లో పుతిన్ అక్కడ మేయర్ కార్యాలయంలో పనిచేసేవారు. అక్కడ పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ది వ్యాట్కా నదిపై ప్రిగోజిన్ 'న్యూ ఐలాండ్' పేరిట తేలియాడే రెస్టారెంట్‌ను స్థాపించారు. 2000లో పుతిన్ రష్యా అధ్యక్షుడు అయ్యారు. మరోపక్క ప్రిగోజిన్ రెస్టారెంట్లు ఇతర వ్యాపారాలను విస్తరించాడు. 2001లో ఫ్రాన్స్ అధ్యక్షుడు జాక్ షిరాక్ పర్యటించిన సమయంలో 'న్యూ ఐలాండ్'లో పుతిన్ విందు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ప్రిగోజిన్ స్వయంగా అతిథులకు వడ్డించారు. ఆ తర్వాత నుంచి పుతిన్ సన్నిహిత వర్గాల్లో ప్రిగోజిన్ కనిపిస్తూనే ఉన్నాడు. విదేశీ అతిథులు వచ్చిన సందర్భాల్లో చాలా సార్లు ప్రిగోజిన్ వడ్డిస్తూ ఫొటోల్లో దర్శనమిస్తాడు. రష్యా ప్రభుత్వానికి చెందిన సైనిక, పాఠశాల ఫుడ్ కాంట్రాక్టులు ఇతనికే దక్కాయి. ఆ తర్వాత 2014లో వాగ్నార్ పీఎంసీ నిర్వహణలో ప్రిగోజిన్ పాత్ర కూడా బయటకు వచ్చింది. క్రిమియా ఆక్రమణలో 'లిటిల్ గ్రీన్‌మ్యాన్' రూపంలో వాగ్నార్ గ్రూప్ హస్తం ఉంది. 2016లో ప్రిగోజిన్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. 2016 అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌నకు అనుకూలంగా ప్రచారం చేయించింది కూడా ప్రిగోజిన్ అని ఆరోపణలు ఉన్నాయి. 'బ్యాటిల్ ఆఫ్ డెబాల్ట్సెవ్'లో కూడా వీరి హస్తం ఉంది. అమెరికా ఎఫ్‌బీఐ ఇతనిపై 2,50,000 డాలర్ల బహుమతి కూడా ప్రకటించింది.
ఏమిటీ వాగ్నార్ పీఎంసీ..?
What is Wagner Group: వాగ్నార్ పీఎంసీ రష్యా ప్రైవేటు సైన్యం. వాస్తవానికి ఈ పేరుతో ఏ కంపెనీ రిజిస్టరై లేదు. రష్యా సైన్యానికి చెందిన మాజీ లెఫ్టినెంట్ కర్నల్ దిమిత్రి ఉత్కిన్ ప్రారంభించాడు. జర్మనీ నియంతకు ఇష్టమైన ఒపేరా కంపోజర్ వాగ్నార్ పేరిట దీనిని ప్రారంభించినట్లు చెబుతారు. ఉత్కిన్ శరీరంపై నాజీ దళాల పచ్చబొట్లు కూడా ఉంటాయి. ఇతడు రష్యా ఇంటెలిజెన్స్ ఎజెన్సీ జీఆర్‌యూలో కూడా పనిచేశాడు. 1994-96, 1999-2009లలో జరిగిన రెండు చెచెన్ యుద్ధాల్లో పనిచేశాడు. ఉత్కిన్-ప్రిగోజిన్‌కు మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రిగోజిన్ వ్యాపార లక్ష్యాలు.. క్రెమ్లిన్ జాతీయ లక్ష్యాల మధ్య సారూప్యత ఉండటంతో వాగ్నార్ గ్రూప్‌కు ఎదురు లేకుండా పోయింది. వాగ్నార్ బృందంలో అత్యధికంగా మాజీ సైనికులే ఉంటారు. వీరికి కొన్ని సందర్భాల్లో సాధారణ రష్యా సైనికుడికంటే చెల్లింపులు ఎక్కువగా ఉంటాయి. వీరు మరణిస్తే కుటుంబానికి దాదాపు 50 వేల డాలర్ల వరకు చెల్లిస్తారు. 2017లో బ్లూమ్‌బెర్గ్ లెక్క ప్రకారం ఈ గ్రూపులో 6,000 మంది ఉన్నారు. ముఖ్యంగా రష్యా మిలటరీ, ఇంటెలిజెన్స్ వర్గాలు వీటిని నియంత్రిస్తుంటాయని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ సంస్థ పేర్కొంది.
వాగ్నార్ గ్రూప్‌తో అనేక రకాలుగా రష్యాకు లాభం. సైనిక శిక్షణ పొందిన కిరాయి మనుషులు లభిస్తారు. దీంతోపాటు విదేశాల్లో లక్ష్యాలను సాధించేందుకు నేరుగా రష్యా యూనిఫామ్‌లోని మనుషులను పంపాల్సిన పనిలేదు. ఆదే సమయంలో తమకు సంబంధంలేదని తప్పించుకొని.. విదేశీ సంబంధాలును కాపాడుకోవచ్చు.