Ukraine crisis రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ దేశాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. యుద్ధానికి కాలు దువ్విన రష్యా-ఉక్రెయిన్ విదేశీ ఎగుమతుల గొలుసులకు ప్రధాన మార్గాలు ఉండటం వల్ల ఇది ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఐరోపా దేశాలు సహా ఇతర దేశాలకు ఎగుమతయ్యే ఆహారం, నిత్యవసర వస్తువులు, ముడి పదార్ధాలు, గ్యాస్, ఇంధనం వంటి కీలకమైన ఉత్పత్తుల సరఫరాకు ఈ రెండు దేశాలే ప్రధాన మార్గాలుగా ఉన్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న భయోత్పాత పరిస్థితులు వివిధ దేశాలకు శాపంగా పరిణమించనున్నాయి.
Russia Ukraine News
గ్యాస్ ధరకు రెక్కలు
ముఖ్యంగా ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలు రష్యా నుంచి ఐరోపా దేశాలకు ఎగుమతయ్యే ఇంధన సరఫరాకు ఆటంకంగా మారనుంది. మెజారిటీ ఐరోపా దేశాలు రష్యా నుంచి భూగర్భ పైపుల నుంచి సరఫరా అయ్యే గ్యాస్‌పై ఆధారపడి ఉన్నాయి. అయితే ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా నుంచి పూర్తి స్థాయిలో గ్యాస్ ఎగుమతయ్యే అవకాశం లేదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. గ్యాస్ సరఫరాలో నెలకొనే అంతరాయాలు ఆధారిత దేశాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదముందని చెబుతున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా ఇంధన ఉత్పత్తుల ధరలు భారీగా పెరగగా.. మరోమారు రష్యా నుంచి గ్యాస్ సరఫరా క్షీణిస్తే వాటి ధరలు మరింత ప్రియంగా మారే ప్రమాదం ఉంది.
Russia Ukraine War Crisis
వీటికి కొరత..
మరోవైపు ఆహార పదార్థాల ఎగుమతులు పైనా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రపంచంలోని గోధుమల ఎగుమతుల్లో నాల్గోవంతు భాగం ఒక్క రష్యా-ఉక్రెయిన్ నుంచే ఉన్నాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్ ఎగుమతుల్లోనూ సగం వరకూ ఉక్రెయిన్ నుంచే ఇతర దేశాలకు సరఫరా అవుతోంది. దీనికి తోడు అనేక ఆహార ఉత్పత్తుల్లో వినియోగించే కీలక వస్తువులు రష్యా, ఉక్రెయిన్ నుంచే ఎగుమతి అవుతున్నాయి. ఈ రెండు దేశాల ఉద్రిక్తతలు ప్రపంచ దేశాల్లో ఆహార కొరతకు దారి తీసే ప్రమాదముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.