Ukraine Crisis: ఉక్రెయిన్‌పై సమరశంఖం పూరించి వారంరోజులైనా అనుకున్న లక్ష్యాలను సాధించకపోయిన కారణంగా రష్యా దాడుల తీవ్రత పెంచింది. అర్ధరాత్రి నుంచి రాజధాని కీవ్‌పై వైమానిక దాడులు తిరిగి మొదలుపెట్టింది. నగరమంతా సైరన్ శబ్దాల మోత మోగిపోయింది. కీవ్‌లోని ప్రధాన టీవీ టవర్‌పై రష్యా క్షిపణితో దాడి చేసింది. పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో దారివెంట వెళ్తున్న ఐదుగురు పౌరులు చనిపోయినట్లు ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది. రష్యాకు చెందిన 65 కిలోమీటర్ల పొడవైన సాయుధ కాన్వాయ్ కీవ్ నగరానికి సమీపించినట్లు మేయర్ తెలిపారు. శివారులో భీకరపోరు జరుగుతున్నందున ప్రజలెవ్వరూ కూడా బయటికి రావద్దని సూచించారు. నగరాన్ని కాపాడుకునేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రష్యా దురాక్రమణ ప్రయత్నాలను కీవ్ ఇప్పటివరకు అడ్డుకుంటూ వచ్చింది.
ఖేర్సన్ స్వాధీనం:
దక్షిణ ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ నగరంలోకి పుతిన్ సేనలు ప్రవేశించినట్లు నగర మేయర్ తెలిపారు. రైల్వేస్టేషన్, నల్లసముద్రం తీరంలోని ఓడరేవు వారి ఆధీనంలోకి వెళ్లినట్లు పేర్కొన్నారు. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ సైనికులతోపాటు పౌరులు కూడా చనిపోయినట్లు మేయర్ చెప్పారు. ఖేర్సన్ నగరం తమ నియంత్రణలోకి వచ్చినట్లు ప్రకటించిన రష్యా రక్షణశాఖ.. తమ బలగాలు, ట్యాంకుల కవాతుకు సంబంధించిన వీడియోలను విడుదల చేసింది. నగరమంతా చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి.
ఖార్కివ్‌పై విధ్వంసం:
ఉక్రెయిన్‌లోని రెండోపెద్ద నగరమైన ఖార్కివ్‌పై రష్యన్ సేనలు భారీఎత్తున విరుచుకుపడుతున్నాయి. ఇక్కడి ప్రాంతీయ పోలీస్ భవనంతోపాటు ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై రాకెట్లతో దాడిచేశాయి. ఈ దాడిలో పోలీస్ భవనం మంటల్లో తగలబడింది. ఆ తర్వాత కరజిన్ విశ్వవిద్యాలయంపై కూడా వైమానిక దాడి జరిగినట్లు ఉక్రెయిన్ అధికారవర్గాలు తెలిపాయి. ఖార్కివ్ నగరాన్ని హస్తగతం చేసుకునేందుకు రష్యా పారా ట్రూపర్లు రంగంలోకి దిగినట్లు పేర్కొన్నాయి. మిలిటరీ ఆస్పత్రిని లక్ష్యంగా చేసుకొని రష్యా దాడి చేసినట్లు ఖార్కివ్ గవర్నర్ తెలిపారు. పుతిన్ సేనల దాడుల్లో ఇప్పటి వరకు 21 మంది చనిపోగా.. వందమందికిపైగా గాయపడినట్లు చెప్పారు. అయితే తమ బలగాలు గట్టిగానే ప్రతిఘటిస్తున్నట్లు చెప్పారు. మాస్కో బలగాలకు కూడా భారీగానే నష్టం వాటిల్లినట్లు ఖార్కివ్ గవర్నర్ చెప్పారు. మరోవైపు రష్యాలోని ఉక్రెయిన్ ఎంబసీని మూసివేశారు. సిబ్బంది మొత్తం వెళ్లిపోగా.. గేట్లకు తాళాలు వేశారు. ఉక్రెయిన్ నుంచి ఇప్పటివరకు 8లక్షల 36వేల మంది ఇతర ప్రాంతాలకు వలసవెళ్లినట్లు ఐరాస ప్రకటించింది.
రష్యా దాడులు ఉద్ధృతం కాగా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ యూదుల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. మౌనంగా ఉండొద్దని ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులను కోరారు. మాస్కో క్షిపణులు బాబీయార్ హోలోకాస్ట్ స్మారకాన్ని తాకిన తర్వాతనైనా మాట్లాడాలన్నారు. యూదుల చరిత్రను తుడిచేయాలని రష్యా భావిస్తున్నట్లు జెలెన్‌స్కీ తెలిపారు. ఉక్రెయిన్‌కు ఐరోపాతోపాటు పశ్చిమదేశాలు, అక్కడి సంస్థల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రపంచ బ్యాంకు 3బిలియన్ డాలర్ల అత్యవసర సాయం అందించనున్నట్లు ప్రకటించగా.. రష్యా వ్యాపారవేత్తలపై మరిన్ని ఆంక్షలు విధించనున్నట్లు ఈయూ పేర్కొంది. రష్యాలో తమ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు యాపిల్ సంస్థ ప్రకటించింది. ఐరోపా దేశాలు తమపై ఆంక్షలు విధించటంతో రష్యా కూడా ప్రతిచర్యకు దిగింది. రష్యాకు చెందిన అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బర్ ఐరోపా నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో బలవుతున్న సాధారణ ప్రజలు ఇదీ చదవండి:ఉక్రెయిన్ నింగిపై పట్టు కోసం రష్యా తిప్పలు.. బాంబులు లేవా?
రష్యాను ఎదుర్కోవడానికి మేము సిద్ధం: బైడెన్