Ukraine Crisis: ఉక్రెయిన్‌పై విచక్షణా రహితంగా విరుచుకుపడుతున్న రష్యాపై అమెరికా, బ్రిటన్ భారీ ఆర్థిక అస్త్రాన్ని సంధించాయి. చమురు ఎగుమతుల ద్వారా ఆ దేశానికి వస్తున్న ఆదాయానికి గండికొట్టే కీలక నిర్ణయం తీసుకున్నాయి. రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతి చేసుకోరాదని అమెరికా మంగళవారం నిర్ణయించింది. రష్యాపై ఇప్పటికే విధించిన ఆంక్షలకు ఇది అదనం. తద్వారా రష్యాపై ఒత్తిడిని తీవ్రతరం చేయొచ్చని బైడెన్ సర్కారు భావిస్తోంది. ఇతర ఆంక్షల ప్రభావం రష్యాపై ఉన్నా, ఇంధన అమ్మకాల ద్వారా నిరంతరం ఆర్థిక వనరులు పొందగలుగుతోంది. అందుకే అమెరికా ఈ అడుగు వేసింది. దీని ప్రభావం తమ ప్రజలపైనా పడవచ్చనీ, అయినా రష్యా చేపట్టిన యుద్ధాన్ని సమర్థించేది లేదని బైడెన్ స్పష్టంచేశారు.
తరలిపోయేవారికి వెసులుబాటు
Ukraine Russia War: బాంబులు, రాకెట్లు, క్షిపణుల మోత నుంచి ఎంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలిపోదామా అని ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఉక్రెయిన్‌లో నిరీక్షిస్తున్నవారికి ఎట్టకేలకు కాస్త ఉపశమనం లభించింది. ప్రజలు తరలిపోవడానికి సురక్షిత నడవాలు(సేఫ్ కారిడార్లు) ఏర్పాటు చేసేందుకు అంగీకరించిన రష్యా- ఈసారి ఆ మాట నిలబెట్టుకోవడంతో ఆ ప్రక్రియ మొదలైంది. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న ప్రజలతో ప్రత్యేక బస్సులు కిటకిలాడాయి. రెడ్‌క్రాస్ చిహ్నం బస్సుల్లో వీరిని తరలిస్తున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 20 లక్షల మందికి పైగా ప్రజలు వలస వెళ్లినట్లయిందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. కొన్నిరోజులుగా కీవ్‌లో నిలిచిపోయిన భారతీయ విద్యార్థులు మొత్తానికి అక్కడి నుంచి కదిలి పోల్టావా అనే ప్రాంతానికి బయల్దేరారు.
తేల్చుకునే స్వేచ్ఛను ప్రజలకు వదిలేయాలి
సురక్షిత కారిడార్లు ఒకటికంటే ఎక్కువే ఉంటాయనీ, అయితే అవి రష్యాకు దారి తీస్తాయని రష్యా సమన్వయ కేంద్రం తెలిపింది. ఎక్కడకు వెళ్లాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ ప్రజలకు వదిలేయాలని రష్యా రాయబారి ఐరాసలో పేర్కొన్నారు. భారత్, చైనాలకు చెందిన విద్యార్థులు సహా పలువురిని ఉక్రెయిన్‌లోని పొల్టావా నగరానికి చేరుస్తామని ఉక్రెయిన్ ఉప ప్రధాని ఇరియానా వెరెష్‌చుక్ చెప్పారు. రష్యా, బెలారస్‌లకు ప్రజల్ని తరలించాలనే ప్రతిపాదన ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రజల తరలింపు విషయంలో ఐక్యరాజ్యసమితిలోనూ రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.