జపాన్‌లో తీరంలో కొద్దిరోజులుగా నిలిపివేసిన 'డైమండ్ ప్రిన్సెస్' బోటులో కొవిడ్-19(కరోనా వైరస్) బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ముగ్గురు భారతీయులతో సహా మొత్తం 355 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా మరో ఇద్దరు ఇండియన్స్ ఆ జాబితాలోకి చేరారు. గత రెండు రోజుల్లో ఈ నౌకలో కొత్తగా 137 మంది వైరస్ బారినపడ్డారని జపాన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. నౌకలో తుది పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి మొదలవుతాయని కార్యాలయ అధికారులు పేర్కొన్నారు.
జపాన్ నిర్బంధం అనంతరం.. నౌక నుంచి భారతీయులందరినీ ముందస్తుగా వెనక్కి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు జపాన్ ప్రభుత్వం తెలిపింది.
'పరిస్థితులు చక్కదిద్దుకోగానే భారతీయులను స్వదేశానికి పంపించడానికి జపాన్ సిద్ధంగా ఉంది. అంతవరకూ ధైర్యంగా ఉండాలని ఆశిస్తున్నాము.'
- జపాన్‌లోని భారత రాయబార కార్యాలయం
క్రూయిజ్‌నౌకలో మొత్తం 3,711 మంది ఉండగా.. అందులో 138 మంది భారతీయులున్నారు. వారిలో 132 మంది సిబ్బంది కాగా, ఆరుగురు ప్రయాణికులు. ఇవాళ నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఇద్దరు భారతీయులకు 'కొవిడ్-19' పాజిటివ్ వచ్చినందున.. మొత్తంగా ఐదుగురు ఇండియన్స్‌కు ఈ మహమ్మారి సోకినట్లైంది.