ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం జరిగింది. మెల్బోర్న్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించిన పోలీసుల వాహనాన్ని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక మహిళా అధికారి సహా నలుగురు పోలీసులు అక్కడికక్కడే మరణించారు.
మెల్బోర్న్లోని ఈస్టర్న్ ఫ్రీవేపై పోర్షె కారులో ఓ వ్యక్తి మితిమీరిన వేగంతో వెళుతుండగా పోలీసులు అడ్డగించారు. ఆ సమయంలో ఓ లారీ వచ్చి పోలీసుల వాహనంతో పాటు పోర్షే కారును వెనక నుంచి ఢీకొట్టింది. పోలీసుల వాహనం పల్టీలు కొడుతూ చాలా దూరం వెళ్లింది. అందులో ఉన్నవారంతా మరణించారు. విక్టోరియా రాష్ట్రంలో ఒక ప్రమాదంలో ఇంతమంది పోలీసులు మరణించటం ఇదే తొలిసారి.
పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన లారీ అపస్మారక స్థితిలో డ్రైవర్..
ప్రమాదానికి కారణమైన వాహనాన్ని రిఫ్రిజరేటర్ ట్రక్గా గుర్తించారు పోలీసులు. దాని డ్రైవర్ కూడా ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి వెళ్లాడు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిందా లేదా ప్రమాదవశాత్తూ జరిగిందా అన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కారు యజమానిని..
ప్రమాదం నుంచి బయటపడిన పోర్షె కారులోని వ్యక్తి.. ఆ చిత్రాలను ఆన్లైన్లో పోస్ట్ చేశాడు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకొని ప్రమాదంతో ఏదైనా సంబంధం ఉందా అన్న కోణంలో విచారించారు పోలీసులు. అతనికి ఇదివరకే నేర చరిత్ర ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో అతను మాదకద్రవ్యాలను సేవించినట్లు గుర్తించారు.
ఇదీ చూడండి:ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా మృతదేహాలు