బంగ్లాదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. రైల్వే క్రాసింగ్ వద్ద పట్టాలు దాటుతున్న బస్సును రైలు ఢీకొని 12 మంది మరణించారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. రైల్వే క్రాసింగ్ వద్ద సిబ్బంది లేకపోవటం, గేటు తీసి ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 24 మంది ప్రయాణికులు ఉన్నారు.
రాజ్సాహి-ప్రతిభాపుర్ల మధ్య నడిచే ఉత్తర ఎక్స్ప్రెస్ రైలు.. జోయ్పురాత్ జిల్లాలోని పురాణాపోలి రైల్వే క్రాసింగ్ దాటుతున్న బస్సును వేగంగా వచ్చి ఢీకొట్టింది. సుమారు అర్ధ కిలోమీటర్ వరకు బస్సును లాక్కెళ్లింది. దీంతో ప్రాణ నష్టం అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని 8 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించగా.. అందులో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటనాస్థలం నుంచి మరో 10 మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం తరలించినట్లు చెప్పారు. కాపలాలేని రైల్వే క్రాసింగ్లు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇలాంటి ప్రమాదాలు పెరిగాయని అగ్నిమాపక అధికారులు వెల్లడించారు.