కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న వేళ... అనేక దేశాలు విదేశీ పర్యటకులను దూరంగా ఉంచాలని ఆలోచిస్తున్నాయి. మరోవైపు ప్రాంతీయ సమావేశాలను కూడా నిలిపివేస్తున్నాయి.
వైరస్ ఉద్ధృతి ఉన్నా...
కరోనా సమాజిక వ్యాప్తిని అరికట్టేందుకు మెల్బోర్న్లో ఆరువారాల పాటు లాక్డౌన్ విధించారు. అయినప్పటికీ.. సోమవారం కొత్తగా 532 కేసులు నమోదయ్యాయి.
"ఆస్ట్రేలియాలో కొవిడ్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్నప్పటికీ.... ప్రజలు పనులకు వెళుతున్నారు. వారు కనీసం కరోనా నిర్ధరణ పరీక్షలు చేసుకోవడం లేదు. అందువల్ల కరోనా వ్యాప్తి బాగా పెరిగిపోతోంది."
- డేనియల్ ఆండ్రూస్, విక్టోరియా స్టేట్ ప్రీమియర్
పర్యాటకంపైనా ఎఫెక్ట్...
ఆసియా- పసిఫిక్ ప్రాంతంలో కరోనా ధాటికి బాగా దెబ్బతిన్న దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. అందువల్ల విదేశీ ప్రయాణికులను దేశంలోకి రాకుండా నిషేధం విధించింది. ఒకవేళ ఎవరినైనా అనుమతించినా కరోనా నిర్ధరణ పరీక్షలు చేసుకుని, కఠిన క్వారంటైన్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
అంతర్జాతీయ విమాన సేవల పునరుద్ధరణ
కొన్ని దేశాలు పరిమితంగా అంతర్జాతీయ విమాన సేవలు పునరుద్ధరించాలని భావిస్తున్నాయి. అయితే దీని వల్ల కరోనా వ్యాప్తి మరింత పెరిగే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.
హెచ్చరిక.. అక్కడకు వెళ్లొద్దు...
చాలా యూరోపియన్ దేశాలు తమ పౌరులను.. స్పెయిన్‌కు వెళ్లవద్దని హెచ్చరించాయి. వేసవి విడిది అయిన స్పెయిన్.. నేడు కరోనా విలయానికి నిలయం కావడమే ఇందుకు కారణం. అయితే.. ఒక నెలక్రితమే అక్కడ లాక్డౌన్ నిబంధనలను సడలించారు.
కీలక సమావేశాలు వాయిదా...
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కీలక అంతర్జాతీయ సమావేశాలు... ఆన్‌లైన్‌కు మారాయి. అయినప్పటికీ కరోనా భయాలు మాత్రం తొలగిపోవడం లేదు. అందుకే వచ్చేవారం తమ దేశంలో జరగాల్సిన ఆగ్నేయాసియా విదేశాంగ మంత్రుల వార్షిక సమావేశాన్ని సెప్టెంబర్ వరకు వాయిదా వేసింది వియత్నాం.
విదేశాల నుంచి కరోనాను తీసుకొస్తున్నారు..
దక్షిణ కొరియాలో కొత్తగా 25 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 16 కేసులు విదేశాల నుంచి వచ్చినవేనని అధికారులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం తమ దేశంలోని బుసాన్ తీరానికి వచ్చిన... రష్యా కార్గో షిప్ సిబ్బందిలో డజన్ల మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని వారు తెలిపారు. అలాగే ఇరాక్ నుంచి వచ్చిన కొరియా భవన నిర్మాణ కార్మికులు కూడా కొవిడ్ బారిన పడ్డారని అధికారులు వెల్లడించారు.
సింగపూర్ - న్యూజిలాండ్ - దక్షిణ కొరియా
ఇటీవల ఓ వ్యక్తి న్యూజిలాండ్ నుంచి దక్షిణ కొరియాకు వచ్చాడు. అతనికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీనితో అప్రమత్తమైన న్యూజిలాండ్ అతనితో సంబంధమున్న వారిందరికీ కొవిడ్ టెస్టులు చేయించింది. అలాగే తమ దర్యాప్తులో దక్షిణ కొరియా ప్రయాణికుడు సింగపూర్ వెళ్లినపుడు కరోనా బారిన పడినట్లు తేలిందని వెల్లడించింది.
విజృంభణ కొనసాగుతోంది...
జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ గణాంకాల ప్రకారం, కరోనా వైరస్ వ్యాప్తి మరింత తీవ్రంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కోటీ 64 లక్షల మంది కొవిడ్ బారినపడగా... 6లక్షల 52వేల మందికిపైగా మరణించారు. అయితే కోటి మందికిపైగా వైరస్‌ను జయించడం కాస్త ఊరటనిచ్చే విషయం.
ఇదీ చూడండి:చెంగ్డూలోని కాన్సులేట్‌ను మూసేసిన అమెరికా