అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణలో మరో కీలక ఘట్టం పూర్తయింది. అఫ్గాన్‌లో అగ్రరాజ్య టాప్ కమాండర్ జనరల్ స్కాట్ మిల్లర్ తన బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. కాబూల్‌లో సోమవారం ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో అధికారికంగా ఈ తంతును పూర్తిచేశారు.
ఆయన స్థానంలో మెరైన్ జనరల్ ఫ్రాంక్ మెకెంజీ ఇకపై ఆ బాధ్యతలను చూసుకుంటారు. ఫ్లోరిడాలోని సెంట్రల్ కమాండ్ ప్రధాన కార్యాలయం నుంచే మెకెంజీ పనిచేస్తారు. అవసరమైతే అక్కడి నుంచే అఫ్గాన్ ప్రభుత్వ బలగాల రక్షణ కోసం వైమానిక దాడులు జరిపిస్తారు. మిల్లర్ 2018 నుంచి అఫ్గాన్‌లో అమెరికా టాప్ కమాండర్‌గా ఉన్నారు.